తెలుగు సినీ పరిశ్రమలో హిట్స్ వర్షం కురుస్తోంది… ఈ మాట అన్నది టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. చాలా అరుదుగా సోషల్ మీడియాలో స్పందించే ప్రిన్స్, చిరు, బాలయ్య సినిమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ఈ సంక్రాంతికి విడుదలైన రెండు పెద్ద సినిమాలను చూసేందుకు కాస్త సమయం దొరికింది… అంటూ మొదలుపెట్టిన మహేష్… “చిరంజీవి గారి హయం అంతా మ్యాజికల్, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని మిస్ అయ్యాం… వెల్కం బ్యాక్… ‘ఖైదీ నంబర్ 150’ చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్…” అంటూ చిరు సినిమాలపై తన భావాలను పంచుకున్నారు ప్రిన్స్.
“గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రను పోషించిన నందమూరి బాలకృష్ణకు హ్యాట్సాఫ్. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన అభినయాలలో ఒకటిగా నిలిచిపోతుంది. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను, మీ విజన్ కు హ్యాట్సాఫ్… చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు. క్రిష్… ఈ సినిమాను 79 రోజుల్లో ఎలా పూర్తి చేయగలిగావు, నమ్మశక్యంగా లేదు…” అంటూ బాలయ్య, క్రిష్ లను ఉదాహరిస్తూ మహేష్ తన అనుభూతులను తెలిపారు. ‘మరొకసారి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అంటూ సంక్రాంతి పండగ సందర్భంగా అభిమానులను పలకరించాడు ప్రిన్స్.
నిజంగా ఈ ట్వీట్స్ ప్రిన్స్ నుండి ఊహించినవి కావు. తన సినిమాల గురించి కూడా పెద్దగా సోషల్ మీడియాలో ప్రస్తావించని మహేష్, మెగాస్టార్, నందమూరి నటసింహం చిత్రాల గురించి మాట్లాడడం అంటే చెప్పుకోదగ్గ విషయమే. ప్రిన్స్ నుండి వెలువడిన ఈ ట్వీట్లకు షాక్ అవ్వడం నెటిజన్ల వంతయ్యింది. అయితే తానూ ఏం చేసినా, ఏం చెప్పినా హృదయ పూర్వకంగా చేస్తాడని, అంతే మనస్పూర్తిగా అభినందిస్తారని ప్రిన్స్ అభిమానులకు తెలిసిన విషయమే కావడంతో… చిరు, బాలయ్యల స్థాయికి గౌరవం ఇస్తూ స్పందించారని చెప్పాలి.



