కొందరికి జీవితం అమూల్యమైనది. మరికొందరికి నిరర్ధకమైనది. ఎంతటి కష్టాలు ఎదురైనా ఆశావహ దృక్పథంతో నిబ్బరంగా ముందుకు సాగేవాళ్ళు కొందరైతే.. చిన్న చిన్న కారణాలకే జీవితాన్ని ముగించుకునేవాళ్ళు మరికొందరు. సగం నీళ్ళున్న గ్లాసును చూసి ‘సగమే మిగిలింది’ అనుకునేవాళ్ళు నిరాశావాదులైతే.. ‘ఇంకా సగం నీళ్ళున్నాయిగా’ అనుకునేవాళ్ళు ఆశాజీవులు. మలేషియాకు చెందిన ఎం. కవిత ఈ రెండో కోవకు చెందిన వ్యక్తి.
రోడ్లు ఊడ్చే పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న కవిత తనకు వచ్చే కొద్దిపాటి జీతంతోనే నలుగురు కూతుర్లను పెంచి పెద్ద చేశారు. కష్టపడి పనిచేస్తూనే వాళ్ళను చదివించారు. మంచి భవిష్యత్తు కోసం తన శక్తిమేరకు తోడ్పడ్డారు. ఆ కష్టం ఇప్పుడు ఆమె కూతుర్ల విజయాల రూపంలో కనిపిస్తోంది.
కవిత నలుగురు కూతుర్లలో ఒకరు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నారు. మరొక కూతురు అదే సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా చేస్తున్నారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు ఉపాధ్యాయురాలిగా, మరొకరు నర్సుగా పనిచేస్తూ జీవితంలో స్థిరపడ్డారు. ఒక తల్లి తన పిల్లల భవిష్యత్తు కోసం పడిన కష్టానికి ఇంతకంటే గొప్ప ప్రతిఫలం ఏముంటుంది?
అయితే కూతుర్లు ఉన్నత స్థాయికి ఎదిగినా కవిత మాత్రం తన ఉద్యోగాన్ని వదులుకోలేదు. ఇప్పటికీ రోడ్లు ఊడ్చే పనినే కొనసాగిస్తున్నారు. అందుకు కారణం కూతుర్లు ఆమెను పట్టించుకోవడం లేదని కాదు. తన పిల్లలు ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడిన ఉద్యోగం పట్ల ఆమెకు ఉన్న గౌరవం, తన కాళ్ళపై తాను నిలబడాలన్న ఆత్మగౌరవమే అందుకు కారణం.
ఇటీవల కవిత 50వ పుట్టినరోజు సందర్భంగా నలుగురు కూతుర్లు తల్లికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆమె పనిచేస్తున్న చోటుకే తమ తమ యూనిఫారంలలో వెళ్ళి తల్లితో కలిసి ఫోటోలు దిగారు. పైలట్‌గా పనిచేస్తున్న కూతురు తన టోపీని తల్లి తలపై పెట్టగా.. మరో కూతురు తన గుర్తింపు కార్డును ఆమె మెడలో వేసింది. నడిరోడ్డుపై తమ కూతుర్లు తనను ఈ విధంగా గౌరవించడంతో కవిత సంతోషంతో ఉప్పొంగిపోయారు.
తల్లిదండ్రులను భారంగా భావించేవాళ్ళున్నారు. పుష్కలంగా డబ్బున్నా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వంతులు వేసుకొని పోషించేవాళ్ళున్నారు. ఆస్తులు లాక్కొని బయటకు గెంటేసేవాళ్ళున్నారు. ఆస్తుల కోసం తల్లిదండ్రులను హత్య చేయడానికి కూడా వెనకాడని వారినీ చూస్తూనే ఉన్నాం.
కానీ రోడ్లు ఊడ్చే ఓ పారిశుధ్య కార్మికురాలి బిడ్డలమని చెప్పుకోవడానికి ఈ నలుగురు కూతుర్లు ఏమాత్రం సిగ్గుపడలేదు. పైగా ఆమె తమ తల్లి అని సగర్వంగా చాటుకున్నారు.




