జగన్ అక్రమాస్తులతో పెట్టిన పత్రికగా కీర్తింపబడుతున్న ‘సాక్షి’ పత్రిక కధనాలు రాజకీయ వర్గాలో ఎప్పుడూ కలకలం రేపుతుంటాయి. టిడిపి తూర్పుకు పయనిస్తుంటే… కాదు కాదు పడమర వైపుకే సాగుతుందనే విధంగా కధనాలు ప్రచురితం చేసే ‘సాక్షి’ తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఏపీ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లెల లింగారెడ్డిపై ఆరోపణలు చేసింది. దీంతో సదరు కధనంపై మండిపడ్డ లింగారెడ్డి ‘సాక్షి’పై క్రిమినల్ కేసు వేస్తానని హెచ్చరికలు జారీ చేసారు.
కడప జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (డీ.ఎస్.ఓ)ని లింగారెడ్డి బెదిరించినట్లు ‘సాక్షి’ పత్రికలో ఓ వార్త ప్రచురితమైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన లింగారెడ్డి… “పరిటాల రవి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న వ్యక్తి రేషన్ షాపును నిర్వహిస్తుండటమే కాక అక్రమాలకు పాల్పడుతున్న విషయంపై డీ.ఎస్.ఓ.ను వివరణ అడిగానని” తెలిపారు. అయితే డీ.ఎస్.ఓ.ను తాను దూషించలేదని, వాస్తవాలకు విరుద్ధంగా ‘సాక్షి’ దినపత్రిక తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
డీ.ఎస్.ఓ.ను తాను దూషించినట్లు నిరూపించలేకపోతే ‘సాక్షి’ పత్రికపై క్రిమినల్ కేసు వేస్తానని తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. తప్పుడు కధనాలకు కేరాఫ్ అడ్రస్ గా ‘సాక్షి’ పత్రిక మారుతోందని, ఇటీవల కాలంలో మరింత పెచ్చుమీరుతోందని, ఒకప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఆరోపణలు, తాజాగా అధికారుల స్థాయి వరకు చేరుకుందన్న అభిప్రాయాలను టిడిపి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.





