ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల పుట్టిన రోజు సందర్భంగా ‘మనసుకు నచ్చింది’ అన్న టైటిల్ తో తన జీవితంపై ఓ లఘు చిత్రాన్ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… దానిపై మహేష్ బాబు స్పందించారు. “నా ప్రియమైన సోదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. చక్కటి ప్రయత్నం, నీ హృదయాన్ని ఫాలో అయిపో” అంటూ ఓ చిన్నపాటి సందేశం కూడా ఇచ్చారు.
“తన తండ్రి అభిమానులే సమాజమని అనుకునేదాన్నని, అది తప్పని తెలుసుకునే సరికే ఆలస్యమైపోయిందని, తన వైఫల్యానికి అసలు కారణం తానేనని, ఆపై మనసు మార్చుకుని కొత్త బాధ్యతలు తీసుకోవడం ప్రారంభించిన తరువాత కొత్త శక్తి తన శరీరంలోకి ప్రవేశించిందని” ఈ వీడియోలో మంజుల తన ఆవేదనను వ్యక్తపరిచింది. ప్రయాణం ముఖ్యమే కానీ, గమ్యం ముఖ్యం కాదని అభిప్రాయపడ్డ మంజుల, నాలోని ప్రతిభను గురించి స్వయంగా తెలుసుకున్న తరువాత ఆలోచనా విధానాన్ని మార్చుకున్నానని, మనసు చెప్పినట్టుగా నడవడం ప్రారంభించానని, విజయం సాధించానన్న అనందాన్ని మంజుల వ్యక్తం చేసింది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె తన ప్రయత్నం ద్వారా ఓ మ్యాజిక్ కు క్రియేట్ చేయనున్నారని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. మంజులను చిన్నతనం నుంచి తాను చూస్తున్నానని, తన కళ్ల ముందే పెరిగిందని గుర్తు చేసుకున్న రాఘవేంద్రరావు, ఆమె తన మనసు చెప్పిన మాటలను నమ్మి ముందుకు సాగే మహిళని అన్నారు. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.



