ఈ మధ్య కాలంలో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ సినిమాలు బ్లాక్ బస్టర్ కావడం అరుదైపోయింది. ఆ ఘనతను సాధించింది సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా సదరు ఓటిటికి మిలియన్ల వ్యూస్ తో కాసుల పంట పండించింది. ఈ రెస్పాన్స్ చూసి తట్టుకోలేక మొన్న వారం కొన్ని సెంటర్స్ లో థియేట్రికల్ రిలీజ్ కూడా చేశారు.
అప్పటికే కోట్లాది మంది స్మార్ట్ స్క్రీన్లలో చూసేయడంతో ఆశించిన స్పందన దక్కలేదు. తాజాగా తెలుగుతో పాటు దక్షిణాది బాషలతో డబ్బింగ్ ఆడియోని జోడించారు. దీని ప్రమోషన్ కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చిన మనోజ్ బాజ్ పాయ్ తాను పోషించిన లాయర్ సోలంకి పాత్రను మహేష్ బాబు అయితేనే పర్ఫెక్ట్ గా సూటవుతాడని చెప్పాడు.
వినడానికి బాగానే ఉంది కానీ ఇంత సీరియస్ ఇష్యూ మీద నడిచే సినిమాలో మన సూపర్ స్టార్ ని అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం అంత సులభంగా అంగీకరించలేరు. పైగా ముప్పాతిక భాగం కేవలం కోర్టు ఆర్గుమెంట్లతోనే నడుస్తుంది. చాలా లా పాయింట్లు చర్చకొస్తాయి. పాత్రల మధ్య సుదీర్ఘమైన సంభాషణలు చోటు చేసుకుంటాయి.
ఇందులో ఎలాంటి హీరోయిజం ఉండదు. ఓ ఆశ్రమం బాబా చేతిలో లైంగిక వేధింపులకు గురైన టీనేజ్ అమ్మాయికి న్యాయం జరగడం కోసం ఓ లాయర్ చేసే పోరాటమే సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై. మహేష్ లాంటి అందమైన స్టార్ దీనికి సూటవ్వడు. గుంటూరు కారం, సర్కారు వారి పాట లాంటి కమర్షియల్ మసాలాలు చేస్తున్న హీరోకి మార్కెట్ పరంగా ఇలాంటివి చాలా రిస్క్.
కథల విషయంలో చాలా పట్టింపుగా మహేష్ అంత ఈజీగా ఒప్పుకునే సమస్య ఉండదు. ఏదో యధాలాపంగా మనోజ్ అన్నాడు కానీ జరిగే పని కాదు. ఆ మధ్య విజయ్ ఆంటోనీ కూడా బిచ్చగాడు 2 విషయంలో అచ్చం ఇలాంటి కామెంటే చేసినప్పుడు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
గతంలో నిజం, నాని లాంటి ప్రయోగాలు చేసి దెబ్బ తిన్న మహేష్ ఇప్పుడీ బందాలు నందాలు చేయడం అసాధ్యమే. వకీల్ సాబ్ లో ఉన్నంత స్కోప్ ఇందులో లేదు. అయినా మాస్ సూత్రాలకు అనుగుణంగా నడిచే తెలుగు మార్కెట్ కి ఇలాంటివి సరిపడవు. ఏదో తెలుగు డబ్బింగ్ చూసి సంతృప్తి పడాలే తప్పించి ఎక్కువ ఊహించేసుకోకూడదు.



