ఖైరతాబాద్ ఉపఎన్నికలలో తెలంగాణ రక్షణ సేన తరుపున ఒక బలమైన అభ్యర్థిని నిలబెడతాం అంటూ కవిత చాల కాన్ఫిడెంట్ గా ప్రకటించారు. అయితే కవిత బిఆర్ఎస్ నుంచి బయటకొచ్చి తెరాస తో రాజకీయం మొదలుపెట్టినా ఇప్పటికి ఆ పార్టీలో ఒక్క బలమైన రాజకీయ నేత చేరిక కూడా జరగలేదు.
కవిత కాకుండా టిఆర్ఎస్ పార్టీలో ప్రజా గుర్తింపు పొందిన మరో నేత కనిపించలేదు. అటువంటి పరిస్థితులలో ఖైరతాబాద్ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ పోటీ తధ్యం అంటూ కవిత ప్రకటించడం వెనుకున్న ఆ బలం ఏమిటి.? ఉపఎన్నికలు అనేవి సహజంగానే అధికార పార్టీకి అనుకూలం.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోవడంతో ప్రజలలో కూడా కొంత వరకు ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ ప్రజా వ్యతిరేకత సహజంగానే ప్రతిపక్ష పార్టీకి అవకాశంగా మారుతుంది. అలాంటి పరిస్థితులలో కవిత టిఆర్ఎస్ ఉపఎన్నికలతో రాజకీయ రిస్క్ చేస్తుందా.?
కేసీఆర్ కాదని, కేటీఆర్ ని పక్కన పెట్టి, హరీష్ రావు కి వ్యతిరేకంగా బిఆర్ఎస్ నుంచి కవిత టిఆర్ఎస్ లోకి నాయకుల చేరికలు ఉంటాయా.? అది సాధ్యమా.? అలాగే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కవిత పార్టీలోకి చేరికలు అత్యాశే అవుతాయి. ఇక బీజేపీ పార్టీ నుంచి అంటే అది అసాధ్యమనే చెప్పాలి.
ఇలా తెలంగాణలో ఉన్న బలమైన రాజకీయ పార్టీల నుంచి కవిత తెరాస పార్టీలోకి షిఫ్ట్ కొట్టే ఆ బలమైన నేత ఎవరు.? ఇప్పటికిప్పుడు కవిత ప్రజా బలమున్న రాజకీయ నాయకులను తయారు చేయడం అసాధ్యం. అయితే కవిత ప్రకటనలో ఉండే కాన్ఫిడెన్స్ కవిత రాజకీయంలో కనిపిస్తుందా అనేది రానున్న రోజులలో తేలనుంది.





