జగన్ మనసులో ఆలోచనలు, కోరికలు, వ్యూహాలకు అద్దం పట్టేందుకు వైసీపికి సొంత మీడియా ఉంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఆయన ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని తప్పటడుగులు వేసినా అది గట్టిగా సమర్ధిస్తూ ఉండేది. అది ‘వైసీపి ఎక్స్‌టెన్షన్’లా జగన్ ప్రత్యర్దులపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంటుంది.
అదే సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కొన్ని మీడియా సంస్థలు జగన్ ధోరణిని, పాలనలో లోపాలను, వైఫల్యాలను, అవినీతిని, దౌర్జన్యాలను ఎత్తిచూపుతూ విమర్శిస్తుండేవి. కనుక వాటిపై జగన్ ఎల్లో మీడియా ముద్ర వేసి తన ప్రభుత్వం గురించి రాజకీయ దురుదెశ్యంతోనే దుష్ప్రచారం చేస్తున్నాయని గట్టిగా వాదించేవారు. ఆయన అభిప్రాయాలే సొంత మీడియాలో కనిపించేవి.
ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, వాటికి కష్టకాలంలో, ముఖ్యంగా కీలకమైన ఎన్నికల సమయంలో అండగా నిలబడిన మీడియా సంస్థలు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నాయని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.
జగన్ సొంత మీడియా విశ్వాసం గల కుక్కవంటిది కాగా, టిడిపికి మద్దతు ఇచ్చిన మీడియా పాములా కాటేసే గుణం కలిగినవని, కనుక వాటికి పాలు పోసి పెంచితే కాటేస్తాయని సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలు ఎవరినైనా కాస్త ఆలోచింపజేస్తాయి.
కానీ వీటిలో ఎంత సహేతుకత ఉంది?అని ఆలోచిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి.
ముందుగా జగన్ సొంత మీడియా విశ్వాసం కలిగిన కుక్కవంటిదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ కుక్క తన యజమానికి మేలు చేస్తున్నానని అనుకొంటూ ఆయన ప్రత్యర్దులపై విరుచుకుపడేది.
యజమాని ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని తెలిసినా తోకాడించుకుంటూ ఊబివైపే నడిపించి తీసుకువెళ్ళి దానిలో కూరుకుపోయేలా చేసింది. నేటికీ ఊబిలో నుంచి యజమానిని బయటపడేసేందుకు ఎటువంటి సాయం చేయకపోగా, గట్టున కూర్చొని తోకాడిస్తూ చూస్తోంది. విశ్వాసం గల కుక్క ఈవిదంగా చేయదు కదా?
ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియాల విషయానికి వస్తే నిజానికి అవన్నీ జగన్‌ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుండేవి. కానీ జగన్ నీలిరంగు కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే అవన్నీ పచ్చగా కనిపించడంతో వాటి హితోక్తులు తప్పుగా అర్దం చేసుకున్నారు. అదే… జగన్ వాటి హెచ్చరికలను, హితోక్తులను అప్పుడే సానుకూలంగా స్వీకరించి, లోపాలు సరిదిద్దుకొని ఉండి ఉంటే నేడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండేవారు కదా?
ఇక టిడిపి కష్టకాలంలో అండగా నిలబడినందుకు బదులుగా ఆ మీడియా సంస్థలు ఇప్పుడు ప్రభుత్వంలో ఏవో ప్రయోజనాల కోసం లాబీయింగ్ చేస్తున్నాయనే వాదనలను పూర్తిగా కొట్టిపారేయలేము. ఇది చాలా సహజం.
కానీ వాటి పరిమితులు వాటికీ, సిఎం చంద్రబాబు నాయుడుకి కూడా బాగా తెలుసు. కనుక వాటిని ఆయన చంకనెక్కించుకుంటారనే ఆలోచనే సరికాదు. కనుక ఏదో రోజు అవి పాములా టిడిపి కూటమి ప్రభుత్వాన్ని కాటేస్తాయనే వాదన కూడా అర్దరహితమే.
రాజకీయ పార్టీలకి, మీడియాకి మద్య అనుబందం ఎప్పుడూ బలంగానే ఉంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. కనుక కుక్కలని చూసి పాములని, పాములని చూసి కుక్కలని భ్రమపడటం హాస్యస్పదంగా ఉంటుంది.
—




