ఫుట్‌బాల్ అభిమానుల ఆరాధ్య దైవం, ప్రేమగా గోట్ (గ్రేటస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని పిలిచుకునే అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తొలిసారి భారత్ పర్యటనకి వస్తున్నారు. ‘గోట్ ఇండియా టూర్ 2025’ పేరుతో డిసెంబర్ 13 నుంచి 15 వరకు మూడురోజులు దేశంలో పర్యటిస్తారు.
అలాంటి ఫుట్‌బాల్ మాంత్రికుడు మెస్సీతో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు! భారత్‌లో ప్రధాని, ముఖ్యమంత్రులు దాదాపు అందరూ వృద్ధులే. కనుక ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అంతర్జాతీయ క్రీడాకారుడితో కలిసి ఫుట్‌బాల్ ఆడటం చాలా గొప్ప విషయమే కదా?
ఈనెల 13వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మెస్సీ-సిఎం రేవంత్ రెడ్డి టీమ్స్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతాయి. కనుక ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకమైనది.
ఇటీవలే హైదరాబాద్‌లో ‘గ్లోబల్ సమ్మిట్’ అట్టహాసంగా నిర్వహించారు. దానిలో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి పలు ఐటి కంపెనీలు, పరిశ్రమల సీఈవోలు, పెట్టుబడిదారులు తరలివచ్చారు. కనుక ఆ సదస్సుతో హైదరాబాద్ పేరు అంతర్జాతీయంగా మరోసారి మారుమ్రోగిపోయింది.
ఇప్పుడీ హైదరాబాద్‌లో జరుగబోయే ఈ మెస్సీ-రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్‌ని యావత్ ప్రపంచదేశాలలో ఫుట్‌బాల్ అభిమానులు చూస్తారు. కనుక తెలంగా పేరు మరోసారి మారుమ్రోగుతుంది.
ఎఫ్-1 రేసింగ్‌తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చాలా పెరిగిందని కేటీఆర్ చెప్పుకుంటారు. కానీ దాంతోనే ఆయన ఏసీబీ, ఈడీ కేసులలో చిక్కుకున్నారు. అప్పటి నుంచే మన ఆంధ్రాకు చెందిన ఓ వైసీపీ మంత్రి గుడ్డు మంత్రిగా పాపులర్ అయ్యారు కూడా.
కనుక హైదరాబాద్ లేదా మరో నగరం, రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ పెంచాలంటే వందల కోట్లు ఖర్చు చేసి ఎఫ్-1 రేసింగ్‌లే నిర్వహించక్కర లేదు. ఇలా ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌తో కూడా బ్రాండ్ ఇమేజ్ పెంచవచ్చు.
కేటీఆర్, జగన్ ఇద్దరూ కూడా యువ నాయకులే. కానీ ఏ రోజు ఇలా బరిలో దిగి ఆడలేదు. కనీసం డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అయినా ఓసారి ఇలా బరిలో దిగి ప్రజల ముచ్చట తీర్చితే బాగుంటుంది కదా?







