నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ ఉదయం ప్రజా వేదిక కూల్చివేత పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై విరుచుకుపడ్డారు. ప్రజా వేదిక కూల్చివేత పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించిన యనమలను ఆయన గట్టిగా విమర్శించారు. ఈ క్రమంలో ఆయన పోలవరం అంచనాలపై స్పందించారు. ఐదేళ్లుగా అధికారంలో ఉండి కనీసం పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కూడా కేంద్ర ప్రభుత్వంతో ఆమోదించుకోలేకపోయారని ఆయన ఆక్షేపించారు.
“మా నాయకుడు జగన్ కేవలం నెల రోజులలోనే ఆ పని పూర్తి చేశారు,” అని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే అనిల్ చేసిన వాదన పూర్తి సత్యదూరంగా ఉందని టీడీపీ నాయకులు అంటున్నారు. పోలవరం తాజా అంచనాలను కేంద్ర జలవనరుల శాఖ ఫిబ్రవరి 11న ఆమోదించినట్టు ప్రకటించింది. అయితే రెండు రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పోలవరం తాజా అంచనాలను ఆమోదించినట్టు సభకు తెలిపారు.
అంటే ఫిబ్రవరిలో అంచనాలను ఆమోదించిన సంగతి మంత్రి రెండు రోజుల క్రితం సభకు తెలిపారంతే అని వారు అంటున్నారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు కూడా జరగలేదు. దీనితో జగన్ చేసింది ఏమీ లేదని వారు అంటున్నారు. అదే మంత్రి ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని పార్లమెంట్ లో ప్రకటించారు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి జగన్ దాని మీద కనీసం స్పందించలేదు. మరి దాని క్రెడిట్ కూడా జగనే తీసుకోవాలి కదా అని తెలుగుదేశం నాయకులు ఎద్దేవా చేస్తున్నారు



