రాజాసాబ్ సినిమా ప్రభాస్ అభిమానులకి ఒక పీడ కల. ఒక చిన్న కాన్సెప్ట్ తో రీజనల్ గా తీద్దామని మారుతి తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ అనంతరం అనవసరంగా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రూపాంతరం చెందింది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా రిజల్ట్ ఏంటి అనేది మళ్లీ గుర్తుచేయనక్కర్లేదు.
అయితే ఆ సినిమా రిజల్ట్ కంటే.. ప్రీరిలీజ్ ఈవెంట్లో మారుతి స్పీచ్ మరియు ఎస్.కే.ఎన్ చేసిన హడావుడే ఎక్కువగా గుర్తుంది జనాలకి. “మీరు ముందుంటే నేను మాట్లాడలేను డార్లింగ్” అని మారుతి కన్నీళ్లు పెట్టుకోవడం. ఎస్కేన్ అయితే ఓ పదడుగులు ముందుకేసి “పండగ పండగ రాజాసాబ్ పండగ.. పండగ పండగ ప్రభాస్ పండగ” అని పాడిన పాట మాములుగా వైరల్ అవ్వలేదు. ఏదో మీమ్ నుంచి ఎస్కేన్ రిఫరెన్స్ తీసుకుని ఆ పాట పాడినప్పటికీ.. ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం అదొక మర్చిపోలేని ఆలాపనగా మారింది.
ఇదే విషయమై ఎస్కేన్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. “ఫలానా విషయం మాట్లాడితే వైరల్ అవుతుంది” అని చెబితే నేను సినిమా కోసం అలా పాడాను తప్పితే.. వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు.
అయినా ఏదైనా సినిమా రిజల్ట్ గురించి ప్రశ్నించాలంటే.. సినిమా హీరో లేదా డైరెక్టర్ లేదా నిర్మాతను అడగాలి కానీ, సినిమాలో చిన్న భాగమైన నన్ను కాదు అని ఎస్కేన్ చెప్పడం గమనార్హం. ఇకపోతే.. ఎస్కేన్ ప్రొడ్యూస్ చేసిన “చెన్నై లవ్ స్టోరీ” జూలై 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.




