ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ను తిరువాడనై ఎమ్మెల్యే, నటుడు అయిన తరుణాస్ కలవడం తమిళనాడు రాజకీయాల్లో మరోసారి కొత్త చర్చకు తెరలేపింది. రజనీ ఇంటికి వెళ్లిన కరుణాస్, దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన చర్చల వివరాలు వెల్లడి కానప్పటికీ, రజనీని బీజేపీ తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోందన్న ఊహాగానాలు వస్తున్న వేళ, శశికళ శిబిరంలో ఉండి, నియోజకవర్గ ప్రజల వ్యతిరేకాన్ని చవిచూసిన కరుణాస్ రజనీని కలవడంతో కొత్త అంచనాలు మొదలయ్యాయి.
వీరి భేటీ అనంతరం కరుణాస్ మీడియాతో మాట్లాడుతూ… తాను మర్యాద పూర్వకంగా కలిశానని, సూపర్ హిట్ చిత్రం ‘బాషా’ను డిటిటలైజ్ చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపానని అన్నారు. రజనీకాంత్ అంటే తనకు అభిమానమని, తనకు రజనీ కొన్ని సలహాలు ఇచ్చారని తెలిపారు. ఒక నటుడి హోదాలో ఉండి రజనీని కలిస్తే పెద్దగా ప్రాధాన్యత దక్కేది కాదు గానీ, ఎమ్మెల్యే అయి ఉండి రజనీతో చర్చించడం అనేది తమిళనాట కొత్త ఊహాగానాలకు తెరలేపినట్లయ్యింది.



