ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తిరుమల డిక్లరేషన్ వివాదం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈరోజు సాయంత్రం జగన్ తిరుమలలో స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించనున్న నేపథ్యంలో… జగన్ తిరుమలలో ఎప్పటికీ డిక్లరేషన్ ఇవ్వరని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా మీడియా ముందు స్పష్టం చేశారు.
“జగన్ ఇప్పుడే కాదు… తిరుమలలో ఎప్పటికీ డిక్లరేషన్ ఇవ్వరు… ఇంకో పాతికేళ్ళు ఆంధ్రప్రదేశ్ కు జగనే ముఖ్యమంత్రి… డిక్లరేషన్ ఇవ్వకుండానే పట్టువస్త్రాలు సమర్పిస్తారు,” ఎమ్మెల్యే రోజా ముందు చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో ఎటువంటి తప్పు దొరక్క ఇటువంటి పనికిమాలిన విషయంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం అనేకసార్లు తిరుమలను సందర్శించుకున్నారని, ఆయన ఎప్పుడు డిక్లరేషన్ పై సంతకం చెయ్యలేదని చెప్పుకొచ్చారు. తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేయమని ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు, బిజెపి ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు.
కాగా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్… కాసేపట్లో డైరెక్ట్ గా తిరుమల వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. గత ఏడాది ఆయన పట్టువస్త్రాలు సమర్పించిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ జండా రంగులో వస్త్రం తలకు చుట్టుకుని జగన్ వివాదం సృష్టించారు.




