విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పించే చర్యలు చేపడతానని చెప్పి ఆపై విఫలమైన నరేంద్ర మోడీకి సాయపడి తప్పు చేశాననిపిస్తోందని ప్రముఖ న్యాయవాది, ఆర్జేడీ ఎంపీ రాంజఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సమాజ్ వాదీ సింథి’ సభలో ప్రసంగిస్తూ… మోడీ ప్రధాని కావడానికి తానెంతో కృషి చేశానని, చివరికి మోడీని నమ్మి మోసపోయినట్టు తెలిపారు.
తన హామీలను ప్రధాని నెరవేర్చుకోలేడన్న సంగతి ఇప్పుడు తెలిసిపోయిందని… “నేను మోసపోయినట్టుగా భావిస్తున్నాను. మోడీకి సాయపడినందుకు బాధపడుతున్నా, మీరెవరూ మోడీని నమ్మవద్దని చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న బ్లాక్ మనీని ఇండియాకు తరలించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చి, అది అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఇందుకు తానూ గిల్టీ గా ఫీలవుతున్నానని, మోడీ ఇలా విఫలమవుతారని తాను ఊహించలేదని, యూపీ సిఎం అఖిలేష్ యాదవ్ ఈ దేశానికి ఆశాకిరణంగా రాంజఠ్మలానీ అభివర్ణించారు.
నల్లధనం వెనక్కి తెప్పించే విషయంలో రాంజఠ్మలానీ వ్యాఖ్యలు ఎలా ఉన్నా… సదరు అభిప్రాయాలతో ఏపీ ప్రజలు కూడా ఏకీభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీకి ఏం కావాలంటే అవి ఇస్తాను అంటూ హామీ చేసిన మోడీ, ఇప్పుడు కనీసం కన్నెత్తి కూడా చూడని వైనంపై రాంజఠ్మలానీ కంటే ఏపీ జనాలు గుర్రుగా ఉన్నారు.



