కేంద్రంలో బీజేపీ నేతలు ఏపీకి ‘ప్రత్యేక హోదా’ లేదని చెబుతుంటే… రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఏపీ ప్రత్యేక రాష్ట్రం అని అంటున్నారని, అసలు ‘ప్రత్యేక రాష్ట్రం’ అంటే ఏంటని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేకం చేశారని, ఇంకా ప్రత్యేకం ఏంటని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే బీజేపీ నేతలు ఏపీకి చాలా చేశాం, చాలా ఇచ్చామంటున్నారు… మీ అబ్బ సొత్తు ఏమైనా ఇచ్చారా? అని మోడీ సర్కార్ ను నిలదీశారు.
ప్రజాధనాన్ని ప్రజలకు ఇచ్చేందుకు డ్రామాలాడుతున్నారని, తాము రాష్ట్రానికి అడుగుతోంది భిక్ష కాదని, తమకు కావాల్సింది హక్కు అని, దానిని తాము అడుగుతున్నామని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తేవాల్సిందేనని తెలిపిన నారాయణ, హోదా లేని పక్షంలో మోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇక, విభజనతో ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు నిలువునా మోసం చేసిందని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ కూడా విమర్శలు చేసారు. ప్రధాని మోడీ కేడీలా ఏపీ ప్రజలను మోసం చేశారని, తిరుపతిలో ప్రత్యేకహోదా ఇస్తామని, ఏపీకి హోదా తెచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు అని చెప్పిన విషయం నిజం కాదా? అంటూ నిలదీశారు.
ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం అని అంటున్నారని, దానికి అర్థం ఏంటని, ప్రజల్లోకి వెళ్తాము, బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారని, సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళ్లాలని సవాలు చేశారు. బీజేపీ నేతలు మీడియాకు చెప్పిన మాటలను నేరుగా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వచ్చి ప్రజలతో నేరుగా మాట్లాడినా సంతోషమేనని అన్నారు.





