నందమూరి నటసింహం బాలకృష్ణ చివరి మూడు కమర్షియల్ హిట్స్ “సింహా, లెజెండ్, అఖండ.” ఈ మూడు కూడా బోయపాటి – బాలయ్య కాంబోలో విడుదల అయినవే. మిగిలిన చిత్రాలలో ‘శ్రీరామరాజ్యం, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్’ మంచి పేరును అయితే తెచ్చిపెట్టాయి గానీ, బాక్సాఫీస్ వద్ద కాసులను కురిపించలేకపోయాయి.
దీంతో బోయపాటి లేకుండా బాలయ్య హిట్ కొట్టలేరన్న నానుడి వెళ్లిపోయింది. అయితే ఈ సారి బోయపాటి లేకుండానే కమర్షియల్ హిట్ అందుకుంటుందన్న నమ్మకాన్ని ‘ఫస్ట్ లుక్’లోనే దర్శకుడు గోపిచంద్ మలినేని ఇచ్చేసారు. ‘వేట మొదలు’ అంటూ నందమూరి బాలకృష్ణ నడిచి వస్తోన్న స్టిల్ కు నందమూరి అభిమానులే కాదు, సినీ వీక్షకులు కూడా ఫిదా అయిపోయారు.
బ్లాక్ షర్ట్, లుంగీ కట్టుకుని, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని నడిచి వస్తోన్న నందమూరి నటసింహం స్టైల్ అదిరిపోయింది. ఆ పక్కనే ‘డిఫెండర్’ పేరుతో ఉన్న బ్లాక్ కారు… మొత్తంగా ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసేసింది మైత్రీ మూవీ మేకర్స్. ‘పుష్ప, సర్కార్ వారి పాట’ చిత్రాల అనుభవం నేర్పిన పాఠమో ఏమో గానీ, షూటింగ్ ప్రారంభించిన వెంటనే ‘ఫస్ట్ లుక్’ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసేసింది.
‘క్రాక్’ సినిమా సక్సెస్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ద్వారా బాలయ్యలోని మరో కోణాన్ని చూపిస్తానన్న హామీని అభిమానులకు ఇచ్చారు. తన హెయిర్ స్టైల్ తో ఎప్పుడూ నవ్వుల పాలయ్యే బాలయ్య లుక్స్, బోయపాటి సినిమాలలో మాదిరే ఈ సినిమాలోనూ అదిరిపోయే హెయిర్ స్టైల్ తో దర్శనమిచ్చారు.



