వైసీపీ సానపట్టిన కత్తి నారా లోకేష్‌!

Nara Lokesh Birthday: From Mockery to Minister

నేడు మంత్రి నారా లోకేష్‌ పుట్టిన రోజు. కానీ అయన కేకులు కోయడం లేదు. దావోస్ సదస్సులో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు కూడా దావోస్ సదస్సులోనే ఉన్నారు.

టీడీపి కార్యకర్తలు కూడా ‘రప్పారప్పా’ అంటూ నడిరోడ్లపై కోళ్ళు, మేకలని నరకడం లేదు. పార్టీ కార్యాలయాలలో కేకులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇంతకాలం ‘యధారాజా తదాప్రజా’ అనే నానుడిని నెగెటివ్‌గానే వాడుతుంటాము. కానీ ఇలా పాజిటివ్‌గా వాడవచ్చన్న మాట!

ADVERTISEMENT

నారా లోకేష్‌కి రాజకీయాలలో చంద్రబాబు నాయుడు ‘గాడ్ ఫాదర్’గా ఉన్నప్పటికీ, ఎదురుదెబ్బలు, అవమానాలు, అవహేళనలు తప్పలేదు. ఫ్యామిలీ బిజినెస్ మ్యాన్ నుంచి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడుగా మారే ప్రక్రియలో నారా లోకేష్‌ ముళ్ళబాటలోనే నడవాల్సి వచ్చింది.

మాజీ సిఎం, సిఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు తలుచుకుంటే నారా లోకేష్‌కు బలమైన రక్షణ కవచం ఏర్పాటు చేయగలరు. ప్రమోట్ చేస్తూ సులువుగా రాజకీయాలలో ఈ స్థాయికి చేరుకునేలా చేయగలరు. కానీ ఆయన కొడుకుకి మార్గదర్శనం చేశారు తప్ప కొడుకు భవిష్యత్‌ తన చేతిలోకి తీసుకొని నడిపించాలనుకోలేదు.

కనుక నారా లోకేష్‌కి సిఎం చంద్రబాబు నాయుడు నిజంగానే ‘గాడ్… ఫాదర్’ అని చెప్పవచ్చు.

తల్లి తండ్రులు పిల్లలు ఎదుగుదలకి తోడ్పడటం సర్వసాధారణ విషయం. కానీ చంద్రబాబు నాయుడుని అమితంగా ద్వేషించే జగన్‌ కూడా నారా లోకేష్‌ ఈవిధంగా మారడానికి తోడ్పడటమే విశేషం. నారా లోకేష్‌ని పాతాళానికి తొక్కేయాలనే దురాలోచనతో వైసీపీ నేతల చేత నోటికొచ్చినట్లు అవహేళన చేయించారు. అవమానింపజేశారు.

ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు దంపతులు కొడుకుకి అండగా నిలబడి మార్గదర్శనం చేశారు. ఆ అవమానాలను, అవహేళనలను సవాలుగా తీసుకొని వారు చెప్పిన ఆ లోపాలన్నిటినీ సరిదిద్దుకోవాలని హితవు చెప్పారు. ఆయనలో పోరాట స్పూర్తిని రగిలించారు.

తత్ఫలితంగా నారా లోకేష్‌ నిప్పుల కొలిమిలో కాలి, సాన పట్టిన కత్తిలా మారారు. యువగళం పాదయాత్రలో కొత్త లోకేష్‌ని ఆవిష్కరించుకున్నారు. నేడు ఈ స్థాయికి ఎదిగారు.

కనుక తనని ఈ స్థాయికి చేర్చి 11వ మైలు రాయి దగ్గరే ఆగిపోయిన జగన్‌కి కూడా నారా లోకేష్‌ థాంక్స్ చెప్పడం అవసరమే. అలాగే జగన్‌ కూడా ఎలాంటి సంకోచం లేకుండా ఈ క్రెడిట్ తీసుకోవచ్చు. ఉజ్వల భవిష్యత్‌ ఉన్న మంత్రి నారా లోకేష్‌కు m9 పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories