టిడిపి జాతీయ కార్యదర్శి, మంగళగిరి టిడిపి అభ్యర్ధి నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అయ్యింది. యాపిల్ కంపెనీ ఈ విషయం ఆయనకు ఈమెయిల్, మెసేజ్ ద్వారా తెలియజేసి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీని ఆధారంగా టిడిపి మాజీ ఎంపీ కనకమెదల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల కమీషన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
“గత నెల (మార్చి)లో కూడా యాపిల్ కంపెనీ నుంచి ఇటువంటి హెచ్చరికలు వచ్చాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, ఇంటలిజన్స్ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరూ అధికార వైసీపి కనుసన్నలలో ఇటువంటి అనైతిక పలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. తద్వారా ఏపీలో ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీని దెబ్బ తీసేందుకు వైసీపికి సహకరిస్తున్నారని కనకమేడల పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి పదవీకాలాన్ని రెండేళ్ళకు మించి పొడిగించి ఇన్‌చార్జి డీజీపీగా కొనసాగిస్తోందనే విషయాన్ని కూడా కనకమేడల కేంద్ర ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇంటలిజన్స్ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా తన సర్వీస్ రూల్స్‌కి విరుద్దంగా అధికార వైసీపికి అనుకూలంగా పనిచేస్తున్నారని కనకమేడల తన లేఖలో ఫిర్యాదు చేశారు.
కనుక తక్షణం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించి భాద్యులపై చర్యలు తీసుకోవాలని కనకమేడల కేంద్ర ఎన్నికల కమీషన్‌కు విజ్ఞప్తి చేశారు.
పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసి, ఎన్నికల సమయంలో పోలీస్ వాహనాలలోనే నగదుని నియోజకవర్గాలకు తరలించినందుకు వారిపై కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో జరుగుతున్నదంతా చూస్తున్నా ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఏపీలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు వైసీపి కనుసన్నలలో పనిచేస్తూ, ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నందునే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు రాష్ట్ర డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డితో సహా 22 మందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దానిపై కూడా ఈసీ చర్యలకు సిద్దం అవుతోందని తెలిసి ఉన్నా నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ చేయించడం దుసాహసం, తెలివితక్కువతనమే అనుకోక తప్పదు.




