ఒకప్పుడు నారా లోకేష్ భాష, మాటతీరు, శరీరాకృతి, బహిరంగ సభలలో కనిపించే తడబాటు, మీడియా ముందుకు రావాలంటే సంకోచం కనిపించేవి. కనుక రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో ఆయన ఎక్కువగా పార్టీ కార్యాలయానికే పరిమితమై పార్టీ వ్యవహారాలను చక్కబెడుతుండేవారు.
అయితే చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడు నారా లోకేషే గనుక ఆయనను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటే టీడీపీ మనుగడను దెబ్బ తీయవచ్చని వైసీపీ మేధావులు దురాలోచన చేశారు. కనుక ఓ వ్యూహం ప్రకారం ఆయనను బాడీ షేమింగ్‌తో సహా అన్నివిధాల అవహేళన చేస్తూ మానసికంగా దెబ్బ తీయాలని చాలా గట్టిగా ప్రయత్నించారు.
కానీ వైసీపీ విషయంలో దేవుడి స్క్రిప్ట్ ఎప్పుడూ వారు ఆశించినదానికి పూర్తి భిన్నంగానే ఉంటుంది. వారి విమర్శలు, అవహేళనల నుంచే నారా లోకేష్ తన బలహీనతలు, లోపాలను అర్థం చేసుకున్నారు. తన గురించి వారు చేసిన ప్రతి విమర్శ, అవహేళనను జాబితాగా రాసుకున్నట్లు ఒకటొకటిగా అన్నిటినీ సరిచేసుకున్నారు.
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ కొత్త లోకేష్‌ని చూసి ప్రజలే కాదు ఆయనను అవహేళన చేసిన వైసీపీ నేతలు సైతం ఆశ్చర్యపోయారు.
అప్పటి నుంచి నారా లోకేష్ ప్రస్థానం తిరుగు లేదన్నట్లు మొదలైంది. మంగళగిరిలో ఓడిపోయినా చోటే పోటీ చేసి భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా మంగళగిరినే తన కంచుకోటగా మార్చుకున్నారు.
అవి అసెంబ్లీలో చర్చలు కావచ్చు… బహిరంగ సభలు కావచ్చు… కొత్త లోకేష్ అనర్గళంగా ప్రసంగిస్తున్నారు. అధికారులతో సమీక్షా సమావేశాలు కావచ్చు… పెట్టుబడిదారులతో సమావేశాలు కావచ్చు… లేదా పార్టీ నేతలతో సమావేశాలు కావచ్చు… ఒంటరిగా హ్యాండిల్ చేస్తున్నారు.
మీడియా కావచ్చు, స్కూలు పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరితో మమేకం అవుతున్నారు. మంత్రి నారా లోకేష్ పూర్తి ఆత్మవిశ్వాసం, పరిణతి కనబరుస్తున్నారు.
ఇటీవల ఇద్దరు యువతులు నిర్వహించిన ‘ర్యాపిడ్ ఫైర్’ ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాలు విన్నప్పుడు ఆయనలో మార్పు మరింత స్పష్టంగా కనిపించింది.
ముఖ్యంగా “మీ తండ్రి చంద్రబాబు నాయుడిని దేశ ప్రధాని లేదా రాష్ట్రపతిగా ఎలా చూడాలనుకుంటున్నారు?” అనే ప్రశ్నకు “ఆయనకు ఆ రెండూ వద్దు. ఎందుకంటే ఆయన సేవలు ఆంధ్రప్రదేశ్‌కు చాలా అవసరం,” అన్నారు నారా లోకేష్.
ఆయన సమాధానం కాస్త ఆశ్చర్యం కలిగించినా ఆయన ఇచ్చిన వివరణ విన్నప్పుడు ‘నిజమే కదా?’ అనుకునేలా చేస్తుంది.
సాధారణంగా ఇలాంటి సందర్భాలలో మరెవరైనా అయితే ‘జాతీయస్థాయి పదవులకు తగినవారు’ అని సమాధానం చెప్తారు. కానీ లోకేష్ మాత్రం తండ్రిపై గౌరవం వ్యక్తం చేస్తూనే, మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయకత్వం ఇంకా అవసరమనే సందేశాన్ని ఇచ్చారు.
ముఖ్యంగా బీజేపీతో టీడీపీ రాజకీయ బంధంలో ఉండగా, ప్రధాని మోదీ, అమిత్ షాలు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నకు నారా లోకేష్ ఏమాత్రం తికమకపడి ప్రధాని లేదా రాష్ట్రపతి అని సమాధానం చెప్పినా వెంటనే చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించేవారు విరుచుకుపడేవారు.
కానీ ‘ర్యాపిడ్ ఫైర్’ ప్రశ్నకు కూడా కేవలం ఆరు సెకన్లలో చాలా లోతైన సమాధానం ఇవ్వడం ఆయన పరిణతికి అద్దం పడుతోంది.
రాజకీయాల్లో నాయకులు కేవలం పదవులతో కాకుండా కాలంతో పాటు తమను తాము మార్చుకునే సామర్థ్యంతో కూడా ఎదుగుతారు.
నారా లోకేష్‌లో ఇంత రాజకీయ పరిణతిని చూస్తున్నప్పుడు ఈయన ఆ పాత నారా లోకేషేనా కాదా? అనిపిస్తుంది. కానీ ఏ రంగంలో ఉన్నవారైనా పట్టుదలతో మార్పు కోసం ప్రయత్నిస్తే ఏ విధంగా మారవచ్చో తెలుసుకునేందుకు మంత్రి నారా లోకేష్ మన కళ్ళ ముందున్న నిలువెత్తు నిదర్శనం.




