తన క్యాబినెట్ లోని మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వేలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గతంలో చంద్రబాబు చేసిన ఈ సర్వేలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మొదటి స్థానంలో నిలిచిన సంగతి రాజకీయ విజ్ఞులకు విదితమే. తాజాగా వెలువడిన సర్వేలో మాత్రం దేవినేని రెండవ స్థానానికి పరిమితమవ్వగా, నవ్యాంధ్ర రాజధాని బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్న మంత్రి నారాయణ చివరి స్థానంలో నిలవడం విశేషం.
పార్టీ పరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, శాఖా పరమైన సమీక్షలు, కమిటీల ఏర్పాటు, జిల్లా టూర్లు, చేసిన అభివృద్ధి పనులు తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ ర్యాంకులను ముఖ్యమంత్రి కేటాయించడం జరుగుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి పీతల సుజాత నెంబర్ ‘వన్’ స్థానాన్ని కైవసం చేసుకోగా, దేవినేని ఉమామహేశ్వరరావు – 2, ప్రత్తిపాటి పుల్లారావు -3, రావెల కిషోర్ బాబు – 6, అచ్చెన్నాయుడు -7, పల్లె రఘునాథరెడ్డి -11, కిమిడి మృణాళి- 13వ ర్యాంకులో నిలువగా, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణకు చిట్టచివరి ర్యాంకు లభించింది.





