‘పనామా పేపర్స్’లో స్థానం సంపాదించుకున్న పాకిస్థాన్ దేశాధ్యక్షుడు నవాజ్ షరీఫ్ ఆ దేశ రాజకీయ నాయకుల్లో అత్యంత ధనవంతుడని తేలింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఆస్తుల వివరాలను ప్రకటించాల్సి ఉన్న తరుణంలో నవాజ్ షరీఫ్ తన చిట్టా పొద్దును ప్రజల ముందుంచారు. దీంతో పాకిస్తాన్ ‘శ్రీమంతుడు’ వివరాలు బట్టబయలయ్యాయి.
“తన ఆస్తులను 200 కోట్ల రూపాయలుగా షరీఫ్ పేర్కొన్నారని పాకిస్తాన్ ఎన్నికల సంఘం తెలిపింది. తన ఆస్తుల్లో సింహభాగం తన కుమారుడు పంపినవేనని, ఆ కారణంగానే గత నాలుగేళ్లలో వంద కోట్ల రూపాయలు పెరిగి, 200 కోట్ల రూపాయలకు చేరాయని తెలిపారు. అలాగే విదేశాల్లో తనకు ఎలాంటి ఆస్తులు లేవని షరీఫ్ స్పష్టం చేశారు. తన దగ్గర టయోటా ల్యాండ్ క్రూయిజర్, రెండు మెర్సిడెస్ బెంజ్ వాహనాలు ఉన్నాయని ఈసీకి సమర్పించిన అఫిడవిట్ లో తెలిపారు.
తాజా సమాచారంతో పాకిస్థాన్ పార్లమెంటులో అత్యంత ధనికుడిగా షరీఫ్ నిలిచారు. తరువాతి స్థానాల్లో ఆ దేశ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి షాహిద్ ఖాఖాన్ అబ్బాసీ, ఎంపీలు ఖయాల్ జమాన్, సాజిద్ హుస్సేన్ ఉన్నారు. ఈ ధృవీకరణతో ‘పనామా’ పేపర్స్ లో వచ్చిన సమాచారానికి మరింత విలువ దక్కుతోంది. పక్కా సమాచారంతోనే ‘పనామా’ సంచలన విషయాలను బయట పెట్టిందన్న వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది.





