నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో గత మూడు వారాలుగా వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ వానల ధాటికి చెరువులు.. కుంటలు నదులు, జలాశయాలు అన్ని నిండిపొంగి ప్రవహిస్తున్నాయి. ఇంకా రెండు లేక మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే నిధుల లేమితో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఈ వర్షాల కారణంగా మరింత దారుణంగా మారే అవకాశం వుంది.
నెల్లూరు.. చిత్తూరు జిల్లాలలో కురుస్తున్న వర్షాల కారణంగా వేల కోట్ల రూపాయలలో నష్టం సంభవించింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైనే నష్టం వాటిల్లి ఉంటుందన్న అంచనాలు వేస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాసారు. దీనిపై కేంద్రం స్పందించింది లేదు.
తమిళనాడులోని చెన్నై నగరం నట్టేట మునగడంతో ఏపీలోని పరిస్థితులను కేంద్రం పక్కన పెట్టిందనే వాదనలకు బలం చేకూరుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత… 2000 కోట్లు మంజూరు చేయాలని కోరితే.. కేంద్రం కేవలం 984 కోట్లు ఇచ్చింది. కానీ, ఏపీ 1000 కోట్లు అర్ధిస్తే ఇప్పటివరకు కనీస స్పందన కూడా కరువయ్యింది. ఓ విధంగా చెన్నై నగరం ముంపు ఏపీకి కూడా చాలా నష్టాన్నే తెచ్చిపెట్టినట్లయ్యింది.





