‘ఒక మనసు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు తనయురాలు నిహారిక ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో విఫలమైంది. కమర్షియల్ గా సినిమా సక్సెస్ ని పక్కన పెట్టినా గానీ, సన్నివేశానికి తగ్గట్టుగా వెండితెరపై హావభావాలను పలికించడంలో విజయవంతం కాలేకపోయింది. తొలి సినిమా కావడంతో పెద్దగా విమర్శలు వ్యక్తం కానప్పటికీ, విమర్శకుల ప్రశంసలు అయితే నిహారికకు లభించలేదు.
దీంతో తన కెరీర్ డోలాయమానంలో పడిందన్న వార్తలు వెలుగు చూసాయి. అయితే తాజాగా తన రెండవ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఓ రెండేళ్ళ క్రితం మరాఠీలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘హ్యాపీ జర్నీ’ సినిమా తెలుగులో రీమేక్ లో నిహారిక నటించబోతుందన్న టాక్ హల్చల్ చేస్తోంది. ఓ ప్రముఖ నిర్మాత ఇప్పటికే దీనికి సంబంధించిన రీమేక్ హక్కులను తీసుకున్నారని, అన్నా చెల్లెళ్ళు నేపధ్యంలో సాగే ఈ కధలో… ‘ఆత్మ’గా కనిపించే చెల్లెలు పాత్రలో నిహారిక కనపడనుందని సమాచారం.
కీలకమైన అన్న పాత్రలో ‘అవును’ ఫేం హర్షవర్ధన్ రాణే నటిస్తున్నాడని, అభినయానికి మంచి ఆస్కారం ఉన్న పాత్రలో నటించే అవకాశం నిహారికకు దక్కిందని టాక్. ప్రస్తుతం చిత్రంలోని ఇతర తారాగణం ఎంపిక జరుగుతోందని, ఒక్కసారి అవి పూర్తి కాగానే, అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. మరి మొదటి సినిమాతో మెప్పించలేకపోయిన మెగా డాటర్, ‘ఆత్మ’ రూపంలో రెండవ సినిమాలో అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.



