రాష్ట్ర విభజన అయిన నాటి నుండి ఆర్ధిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీ సాయం కోసం ఆశగా కేంద్రం వైపుకు చూస్తోంది. ఎప్పటికప్పుడు ఇదిగో… అదిగో… అంటూ వార్తలు రావడం… ఆ తర్వాత తుస్సుమనడం పరిపాటిగా మారిపోయింది. ఇలా ఇప్పటికే ఏడాదిన్నర్ర గడిచిపోయింది. ఇప్పటివరకు కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో ఎటువంటి ప్రకటన రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహుశా వీటికి సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగానే శనివారం నాడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలు ప్రకటనలు చేసినట్లుగా కనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం 20 వేల కోట్లు కేటాయించమని చెప్పిన నితిన్ గడ్కరీ, ప్రస్తుతం ఏపీలో 15 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, దీనికి అదనంగా మరో 50 వేల కోట్ల మేరకు రహదారుల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నామని… మొత్తంగా ఏపీకి 65 వేల కోట్లతో రహదారులను ఆధునీకరిస్తామని ప్రకటించారు. గడ్కరీ ప్రకటించిన ప్రాజెక్ట్ లను పరిశీలిస్తే…
– 20 వేల కోట్లతో అమరావతి కేంద్రంగా ఔటర్ రింగ్ రోడ్
– 45 కోట్లతో రాజమహేంద్రవరంలోని మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్
– 8 వేల కోట్లతో 788 కిలోమీటర్ల పాటు కొత్త జాతీయ రహదారికి డీపీఆర్ తయారీ
– 413 కిలోమీటర్ల మేర అనంతపురం – తాడిపత్రి – తోకపల్లి – నరసరావుపేట – గుంటూరు జాతీయ రహదారి నెంబర్ 544 డి అబివృద్ధి
– 130 కిలోమీటర్ల మేర ఆనందపురం – రాజమండ్రి – విజయవాడ జాతీయ రహదారి నెంబర్ 16 అభివృద్ధి
– 120 కిలోమీటర్ల మేర గుండుగొలను – రావులపాలెం – రాజమండ్రి జాతీయ రహదారి నెంబర్ 216 ఎ అభివృద్ధి
– 390 కిలోమీటర్ల మేర కత్తిపూడి – కాకినాడ – ఒంగోలు జాతీయ రహదారి నెంబర్ 216ను 5 వేల కోట్లతో అభివృద్ధి
– 71 కిలోమీటర్ల మేర విజయవాడ నుండి ఏపీ, తెలంగాణా సరిహద్దు వరకు జాతీయ రహదారి నెంబర్ 221ను 516 కోట్లతో అభివృద్ధి
– 56 కిలోమీటర్ల మేర బళ్ళారి నుండి ఆదోని జాతీయ రహదారి నెంబర్ 167ను 200 కోట్లతో అభివృద్ధి
– 52 కిలోమీటర్ల మేర చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారి నెంబర్ 40ను 160 కోట్లతో అభివృద్ధి
ఇవి కాక, మరికొన్ని కొత్త జాతీయ రహదారులు ఏర్పాటు మరియు విజయవాడలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం, గన్నవరం మండలం, కేసరపల్లిలో ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ సెంటర్, ప్రకాశం జిల్లాలో శివరాజ్ నగర్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ & ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఇక, వాస్తవ పరిస్థితులను గమనిస్తే, ప్రకటించిన ఈ మొత్తం జాబితాలో కనీసం సగం పనులు పూర్తయినా కూడా రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు. 65 వేల కోట్ల విలువైన పనులను ఏపీలో చేపట్టామని గర్వంగా చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడేలా ఈ మొత్తం జాబితాను తయారు చేసినట్లుంది గానీ, రాబోయే మూడున్నర్ర సంవత్సరాలలో వీటిలో ఎన్ని పనులు కార్యరూపం దాలుస్తాయన్నది సామాన్యులకు “శేష” ప్రశ్నగానే మిగులుతోంది. ఒకవేళ సామాన్య ప్రజల అంచనాలను మించి కేంద్రం ఈ పనులను చేపడితే వారి “చిత్తశుద్ధి”ని చాటుకున్నట్లవుతుంది..!





