‘నటన’ బోర్ కొట్టేస్తోంది… మంచి పాత్రలు రాకపోతే నటించడం మానేస్తా… అంటూ లేటెస్ట్ గా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన కేరళ కుట్టి నిత్యామీనన్… తనకు తెలుగులో పని చేసిన దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పని విధానం బాగా నచ్చుతుందని, త్రివిక్రమ్ అసలు టెన్షన్ పడడం తానూ చూడలేదని… సాఫ్ట్ గా, చాలా కూల్ గా, సరదాగా తన పని తానూ చేసుకుని వెళ్లిపోతాడని కితాబిచ్చింది.
ఇక, తమిళ విషయానికి వస్తే మణిరత్నం దర్శకత్వం తనకు బాగా నచ్చుతుందని, ప్రతి చిన్న విషయాన్ని చాలా బాగా పట్టించుకుంటారని, ఏ మాత్రం అసంతృప్తి కలిగినా మళ్ళీ షూటింగ్ చేయాల్సిందేనని అంటారని, అంతలా చిన్న విషయం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపింది. ఒకే పనిని నిరంతరం చేయడమంటే తనకు బోర్ కొట్టే విషయంగా చెప్పిన నిత్య, నటనకు గుడ్ బై చెప్తే… తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపడతానని చెప్పుకొచ్చింది.
నేను తెలుగు ఇంత చక్కగా మాట్లాడడానికి కారణం ఒక రకంగా తన తండ్రేనని, నన్ను ముద్దుగా ‘రారా బంగారం’ అని నాన్న పిలిచేవారని, ప్రస్తుతం బెంగుళూరులో ఉంటే కన్నడ కంటే తెలుగే ఎక్కువ మాట్లాడతానని చెప్పింది. 100 రోజుల్లో ప్రేమ ఏ విధంగా పుడుతుందో అన్న కాన్సెప్టే “100 డేస్ ఆఫ్ లవ్” సినిమా అని, ఇది మలయాళ సినిమా అయినప్పటికీ తెలుగులో ఆదరణ పొందుతుందని భావించి తెలుగులో కూడా విడుదల చేస్తున్నామని, తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.



