గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఇటీవల చేసిన అధికారిక ప్రకటన తెలిసిందే. అయితే పార్టీ అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరిస్తూ నామినేషన్ల గడువు ముగిసే చివరి రోజున ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆగ్రహంతో ఊగిపోయారట. కీలక ఎన్నికలుగా పరిగణిస్తున్న గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాల్సిందేనని మొన్నటిదాకా ఆ పార్టీకి చెందిన నగర నేతలు ఉవ్విళ్లూరారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లిన జగన్ నిర్ణయం, గ్రేటర్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
పార్టీ నిర్ణయంతో విభేదించిన కొందరు నేతలు స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దిగేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. పార్టీ బి-ఫాం ఇస్తేనే ఆయా పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిని గుర్తిస్తారు. ఏ పార్టీకి చెందిన అభ్యర్థికి ఆ పార్టీ బి-ఫాం ఇవ్వకుంటే, సదరు అభ్యర్థిని ఇండిపెండెంట్ గానే పరిగణిస్తారు. ఇదే వాదనను తెరపైకి తెస్తున్న వైసీపీ నగర నేతలు, పార్టీ బి-ఫారం ఇస్తే సరి, లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగానైనా బరిలోకి దిగి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ వర్గీయులపై జగన్ పట్టుకు ఇదొక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.





