తాజా యుద్ధంలో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్-గల్ఫ్ దేశాలు ఒకదానితో మరొకటి లాక్ అయిపోయాయి. ఎవరూ వెనక్కు తగ్గలేరు. ఎవరూ తప్పించుకోలేరు.
ఈ యుద్ధంతో గల్ఫ్ దేశాలలో బాంబుల మోత మోగుతుంటే, సందట్లో సడేమియా అన్నట్లు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ వరుస పెట్టి క్షిపణి ప్రయోగాలు చేస్తున్నారు.
శనివారం 10 బాలిస్టిక్ క్షిపణులు పరీక్షించగా, నేడు 12 మల్టిపుల్ రాకెట్ లాంచర్ల ద్వారా క్షిపణులు పరీక్షించారు. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా ఏవిధంగా తన అత్యాధునిక ఆయుధాలు ప్రయోగిస్తూ లోకానికి తన సత్తా చాటి చూపుతోందో, అదేవిధంగా ఉత్తర కొరియా కూడా అవసరం లేకపోయినా ఈ క్షిపణి ప్రయోగాలతో అమెరికాకు తన సత్తా చూపుతోంది.
ఇరాన్‌కు ఉత్తర కొరియా, చైనా, రష్యా దేశాలతో బలమైన అనుబందం ఉంది. కనుక ఇప్పటికే రష్యా, చైనాలు తమ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అమెరికా మోహరింపులు, బాంబులు, క్షిపణి ప్రయోగాలు, అలాగే గల్ఫ్ దేశాలలో అమెరికా స్థావరాలు, యుద్ధ విమానాల గురించి ఎప్పటికప్పుడు రహస్యంగా సమాచారం అందిస్తూ తోడ్పడుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఉత్తర కొరియా కూడా అవసరమైతే ఇరాన్‌కు అండగా అమెరికాతో యుద్ధం చేసేందుకు సిద్దమని సంకేతాలు ఇస్తోందని, ఇరాన్ సాయం కోరితే ఉత్తర కొరియా కూడా యుద్ధంలో దిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో ఉత్తర కొరియా ఇలా కవ్వింపు చర్యలకు దిగేది కాదని అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ, 15 రోజులుగా ఇరాన్ మీద ఏకధాటిగా బాంబుల వర్షం కురిపిస్తున్నప్పటికీ ఇరాన్ కూడా వాటిని ఎదురుదెబ్బ తీస్తూనే ఉంది. ఒకవేళ ఉత్తర కొరియా కూడా ఇరాన్‌తో చేతులు కలిపితే అమెరికా పూర్తిగా ఈ యుద్ధంలో లాక్ అయిపోయినట్లే!




