ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలలో మళ్ళీ వేడి పెంచింది. ఓ మహిళా ఐఏఎస్ అధికారి గురించి అనుచిత కధనం ప్రసారం చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించింది.
హైదరాబాద్ సీపీ విసి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందం రెండు రోజుల క్రితం రాత్రి ఎన్టీవీ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. బ్యాంకాక్ పారిపోతున్న ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిరువురికీ నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఈ సోదాలు, అరెస్టులను బీఆర్ఎస్, వైసీపీలు తీవ్రంగా ఖండించాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పత్రికాస్వేచ్చను హరించివేస్తోందంటూ విమర్శిస్తున్నారు.
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. నేటికీ వాటిని తమ శత్రువులుగానే భావిస్తున్నారు. తీన్మార్ మల్లన్నకు చెందిన యూట్యూబ్ ఛానల్ తమ ప్రభుత్వ విధానాలను, అవినీతిని ప్రశ్నిస్తునందున ఆ ఛానల్ కార్యాలయంలో ఇదేవిధంగా పోలీసులతో సోదాలు నిర్వహించి, అరెస్టులు చేశారు. ఈ విషయాలన్నీ గుర్తులేన్నట్లు కేటీఆర్, హరీష్ రావు ఇప్పుడు పత్రికాస్వేచ్చ గురించి గలగలా మాట్లాడుతున్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరికొన్ని మీడియా సంస్థలని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. వాటిపై ఎల్లో మీడియా, దుష్ట చతుష్టయం అని ముద్రలు వేశారు.
సాటి మీడియా అధినేతలని కూడా చూడకుండా రామోజీరావు, వేమూరి రాధాకృష్ణల గురించి సాక్షి మీడియాలో వ్రాయించిన రాతలు, వేయించిన వికృతమైన కార్టూన్లతో జగన్ సంతృప్తి చెందలేదు. ఆ పత్రికల గురించి, వాటి అధినేతల గురించి జగన్ చాలా అనుచితంగా మాట్లాడేవారు. సాటి మీడియాని ఇంతగా ద్వేషిస్తున్న జగన్ కూడా పత్రికా స్వేచ్చకి భంగం కలుగుతోందంటూ సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేయడం విడ్డూరమే కదా?
అధికారంలో ఉన్నప్పుడు మీడియాని కాలితో నల్లిని నలిపినట్లు నలిపేస్తామని మాట్లాడిన బీఆర్ఎస్, వైసీపీలు నేటికీ తమతమ సొంత మీడియాలో, సోషల్ మీడియాలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాయి. కేటీఆర్ తమ ముఖ్యమంత్రిని ‘హౌలేగాడు’ అనడం తప్పు కాదని వాదిస్తుంటే, చంద్రబాబు నాయుడుని ఉరి తీసినా తప్పు కాదని ఇక్కడ జగన్ తమ అక్కసుని బయటపెట్టుకుంటారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ కూడా వాటి తీరు మారలేదని స్పష్టమవుతోంది కదా?
తమ ప్రవర్తన ఇంత అనుచితంగా ఉన్నప్పుడు, ఇతరుల నుంచి మర్యాద ఆశిస్తే లభిస్తుందా?ఓ పక్క ఇంత నీచంగా వ్యవహరిస్తూ మళ్ళీ పత్రికా స్వేచ్చకి భంగం కలుగుతోందంటూ మొసలి కన్నీళ్ళు కార్చుతున్నారు.
ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పుపడుతూ రాజకీయాలు చేస్తున్నారే తప్ప ఓ మహిళా ఐఏఎస్ అధికారి గురించి ఎన్టీవీలో అనుచిత కధనం ప్రసారం చేయడాన్ని వారు తప్పుగా భావించడం లేదనుకోవాలేమో?




