ఉండవల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో కూటమి అధినేతల సంయుక్త సమావేశంలో జనసేన అధినేత, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెప్పిన ఓ మాటను పట్టుకొని సోషల్ మీడియాలో కొందరు విమర్శలు మొదలుపెట్టారు.
ముందు పవన్ కళ్యాణ్ ఏమన్నారో చూద్దాం. “ఏ రాజకీయ పార్టీ రాత్రికి రాత్రి ఎదగలేదు. టీడీపి ఇంత బలపడటానికి నాలుగు దశాబ్దాలు పైనే పట్టింది.
కనుక జనసేన కూడా ఈ స్థాయికి ఎదగడానికి మరో పాతికేళ్ళు పట్టవచ్చు. ఈ విషయంలో నాకు పూర్తి క్లారిటీ ఉంది. ఆ లక్ష్యంతోనే నేను పని చేస్తున్నాను,” అని అన్నారు.
జనసేన తొలిసారిగా 2024 ఎన్నికల్లో గెలిచి పదవులు, అధికారం దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ డెప్యూటీ సిఎం అయ్యారు. కానీ రెండేళ్ళకే ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల కోసం వారి ఆత్రుత, డిమాండ్స్ చూస్తున్నప్పుడు అత్యుత్సాహమనిపిస్తుంది.
అత్యుత్సాహం అని ఎందుకనాల్సి వచ్చిందంటే, పుంగనూరు, రాయచోటి ఇంకా పలుచోట్ల వైసీపీ ధాటిని టీడీపి తట్టుకుని పోరాడగలిగింది. తాము ఆ స్థాయిలో వైసీపీని ఎదుర్కోగలమా?కనీసం ఎన్నికల ఖర్చు విషయంలోనైనా వైసీపీతో పోటీ పడగలమా? అని జనసైనికులు ఆలోచించుకుంటే అర్థమవుతుంది.
సీట్ల విషయంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న వారికి తమ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ మాటలు అంగీకరించడం, వాటిని జీర్ణించుకోవడం చాలా కష్టమే. ఈ విషయం వారి కంటే వైసీపీకి ఇంకా బాగా తెలుసు. అందుకే ఇలాంటి మాటలను హైలైట్ చేస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటుంది.
కానీ వాస్తవిక దృష్టితో చూస్తే, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజేపిలు రాజకీయంగా బలపడి నిలద్రొక్కుకునేందుకు దశాబ్దాల సమయం పట్టింది. అపర చాణక్యుడని చెప్పుకునే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడానికి 20 ఏళ్ళుపైగా శ్రమించాల్సి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు దేశాన్ని ఏలినా రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కాలేకపోతున్నారు. దశాబ్దాల పాటు తమిళనాడు రాజకీయాలను శాసించిన డీఎంకే, అన్నాడీఎంకేలు రాజకీయాల్లో తొలిసారిగా అడుగుపెట్టిన విజయ్ చేతిలో ఎదురు దెబ్బ తిన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో చాలా పార్టీలు, వాటి అధినేతలు మనకు కనిపిస్తారు.
కనుక జనసేన నేతలు, కార్యకర్తలు కూడా తమ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ రాజకీయ వాస్తవికతను అర్థం చేసుకొని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసుకోవడం పైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
కానీ వారిని బలపడనీయకుండా రెచ్చగొడుతూ, పార్టీని దెబ్బ తీసేందుకు కుట్రలు చేసేవారు చేస్తూనే ఉంటారు. అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ 2029 ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడితే వారికీ, పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా మేలు కలుగుతుంది.





