పవన్-అన్నా పరస్పర అంగీకారంతో విడిపోతున్నప్పటికీ…

Pawan Kalyan and Anna Lezhneva separation news

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, అన్నా లెజినోవా దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోబోతున్నట్లు ఓ ప్రకటన చేశారు.

తమ వైవాహిక బంధం ఇంతటితో ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటామని, మంచి తల్లిదండ్రులుగా ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటామని తెలిపారు. కనుక అందరూ తమ ప్రైవసీని గౌరవించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT

పవన్ మొదటి రెండు పెళ్ళిళ్ళు, విడాకులు, పిల్లల గురించి అందరికీ తెలిసిందే. కనుక ఇప్పుడు వారి ప్రస్తావన అనవసరం.

పవన్-అన్నా దంపతులు అన్యోన్యంగానే జీవిస్తుండేవారు. అన్నా విదేశీయురాలు, క్రిస్టియన్ అయినప్పటికీ హిందూ మతాచారాలను పాటిస్తూ ఉండేవారు. భర్త ఆరోగ్యం కోసం తరచూ దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేస్తుండేవారు. పవన్ కూడా ఆమె పట్ల చాలా ప్రేమాభిమానాలు చూపుతుండేవారు.

అన్న చిరంజీవి రాజకీయాలలో విఫలమైన చోట పవన్ కళ్యాణ్‌ జనసేనతో రాజకీయ ప్రయాణం ప్రారంభించి, అనేక ఆటుపోట్లు, అవహేళనలు భరిస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. ఇటీవల మున్సిపల్, పరిషత్ ఎన్నికలప్పుడు కూడా పార్టీకి దిశానిర్దేశం చేసి జనసేన పార్టీ ఘన విజయం సాధించేలా చేశారు.

అంతా సాఫీగా సాగిపోతోందనుకుంటున్న ఈ సమయంలో ఆయన వ్యక్తిగత జీవితంలో మరోసారి ఇలాంటి పరిణామం జరుగుతుండటం చాలా బాధాకరమే.

ముఖ్యంగా ఆయనను మానసికంగా, రాజకీయంగా దెబ్బ తీసేందుకు ప్రత్యర్ధులు కాసుకు కూర్చున్నప్పుడు, ఇలాంటి నిర్ణయం వారి చేతికి కొత్త అస్త్రాలు అందించినట్లే అవుతుంది. కనుక మళ్ళీ కొంతకాలం రాజకీయ ప్రత్యర్థుల ర్యాగింగ్ భరించక తప్పదు. ఇది విడాకుల కంటే చాలా బాధాకరంగా మారినా ఆశ్చర్యం లేదు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవిత ప్రభావం తప్పకుండా ఆ పార్టీపై ఎంతో కొంత పడుతుంది. కానీ ఆయన మనస్తత్వం, మంచితనం గురించి జనసైనికులకు, అభిమానులకు బాగా తెలుసు. కనుక వారు ఆయన వెంట నడవడం ఖాయం.

ఇప్పటికే పవన్-అన్నా దంపతులు ఓ నిర్ణయం తీసేసుకున్నారు. కనుక ఆమె, పిల్లల జీవితంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. కానీ వారికి అండగా పవన్ నిలబడతానని మాటిచ్చారు కనుక వారి జీవితాలు సాఫీగానే సాగవచ్చు.

కానీ అత్యంత బాధాకరమైన ఈ నిర్ణయంతో పవన్ జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయనేది రాబోయే రోజుల్లో చూస్తాము.

అది వ్యక్తిగతంగా ఆయనకు, అభిమానులకు, పార్టీకి, కూటమికి, రాష్ట్రానికి మేలు కలిగించేలా ఉంటాయనే ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories