మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన “ఖైదీ నంబర్ 150” సినిమా ఎలా ఉంది? అని అడిగితే… రైతుల కష్టాలను మెగాస్టార్ వెండితెరపై ప్రతిబింబించేలా తీసారు… అభిమానులకు నచ్చే విధంగా కమర్షియల్ అంశాలను చక్కగా మేళవించి తెరకెక్కించారు… యుక్త వయసులో ఉన్న చిరును గుర్తు చేసే విధంగా డ్యాన్స్ లు ఇరగదీసేసారు… ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సమాధానాలు వెల్లడించారు. సామాన్య ప్రేక్షకుడు నుండి సినీ విశ్లేషకుల వరకు సగటున ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి.
మరి అదే ప్రశ్నను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అడిగితే… ఏమన్నారో తెలుసా? ‘అన్నయ్య’ నటించిన 150వ సినిమాను చూసారా..? అని ప్రశ్నించిన మీడియా వర్గాలకు… ఓ చిరునవ్వు చిందిస్తూ… చూసాను… చాలా సరదాగా ఉంది అంటూ పవన్ ఒక్క ముక్కలో చెప్పారు. అయితే పవన్ చెప్పిన సమాధానం బహుశా ఇప్పటివరకు ఎవరూ వ్యక్తపరిచి ఉండకపోవచ్చు. ఒక మంచి సామాజిక సందేశంతో కమర్షియల్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి మెగాస్టార్ 150వ సినిమాను తెరకెక్కిస్తే… పవన్ సింపుల్ గా ‘సరదా’ అంటూ వ్యాఖ్యానించడం విశేషం.
నిజానికి సినిమా విడుదలైన తర్వాత సినీ విమర్శకులు, సాధారణ ప్రేక్షకులు చెప్పిన మాటే… సినిమాలో సరదా సన్నివేశాలు పండలేదని! తెలుగు నేటివిటిలో భాగంగా కామెడీ కోసం చేసిన సీన్లు వర్కౌట్ కాలేదని, మొదటి రోజునే తీర్పు వచ్చేసింది. మరి దానికి భిన్నంగా పవన్ చెప్పడంతో… బహుశా చిరు చేసిన సీరియస్ సీన్లు కంటే, ‘పంచారిష్ట’ ఎపిసోడ్లే పవన్ కు బాగా నచ్చినట్లు ఉన్నాయి… అందుకే సినిమా సరదాగా ఉందని వ్యాఖ్యానించి ఉంటారు అంటున్నారు నెటిజన్లు. కాస్త ఆలస్యమైనా అన్నయ్య సినిమాపై తమ్ముడు చేసిన కామెంట్స్ హాట్ హాట్ గానే మారాయి.



