వీరమల్లు పోరాటాలు… సినిమాకే పరిమితం కాబోవు

Hari Hara Veera Mallu

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సుమారు ఏడాది తర్వాత మళ్ళీ మొహానికి రంగేసుకొని హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సోమవారం నుంచి విజయవాడలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టిన ఈ సినిమా షూటింగ్‌ చాలాకాలం ఆగిపోవడంతో దర్శకుడు జ్యోతీకృష్ణ మిగిలిన సినిమా షూటింగ్‌ పూర్తి చేస్తారు. ఈ సినిమా షూటింగ్‌ చాలా కాలంగా నిలిచిపోయినప్పటికీ పునః ప్రారంభం చేస్తూనే 2025, మార్చి 28వ తేదీన సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.

ఈ సినిమాకి సంబందించి వివరాలు అందరికీ తెలిసినవే. కనుక ఇప్పుడు ఆ చర్చ అవసరం లేదు.

పవన్‌ కళ్యాణ్‌ 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించి, సినిమా షూటింగ్‌లో పాల్గొనడాన్ని తప్పు పడుతూ ఇప్పటికే సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. కనుక రోజా, అంబటి రాంబాబు వంటి వైసీపి నేతలకు ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ని విమర్శించేందుకు నోటి నిండా పనిదొరుకుతుంది. ప్రజలు పవన్‌ కళ్యాణ్‌ని ఎన్నుకొని అధికారం అప్పగిస్తే, పాలనని, ప్రజాసమస్యలను గాలికొదిలి సినిమాలు చేసుకుంటున్నారని విమర్శించడం ఖాయం.

పవన్‌ కళ్యాణ్‌ మొదలుపెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలకు సమయం కేటాయించి పూర్తిచేయాలని ఆ సినిమాల దర్శక నిర్మాతలు చాలాకాలంగా పవన్‌ కళ్యాణ్‌ని కోరుతున్నారు.

ఆ రెండు సినిమాల షూటింగ్‌ ఇంకా ఆలస్యంచేస్తే వచ్చే ఏడాదిలో విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే వాటి నిర్మాతలు చాలా నష్టపోతారు. హరిహర వీరమల్లుని ఇప్పుడు పునః ప్రారంభిస్తే అది విడుదల కావడానికి ఆరు నెలల సమయం పడుతోంది.

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు కనుక తమ సినిమాలకు సమయం కేటాయించాలని ఒత్తిడి చేయక మానరు. కనుక వాటికీ పవన్‌ కళ్యాణ్‌ సమయం కేటాయించక తప్పదు. కేటాయిస్తే వైసీపి నుంచి విమర్శలు కూడా తప్పవు.

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలోకి వచ్చి ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినందుకు ఆయన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. అయితే ఇదే కారణంగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు చేయలేకపోతుండటం వారికి చాలా బాధ కలిగిస్తోంది కూడా.

కనుక పవన్‌ కళ్యాణ్‌కి ఇంత గుర్తింపు లభించి ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడిన సినిమాలు వదిలేయకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.

అభిమానుల కోరిక సహేతుకంగానే ఉంది. కానీ పవన్‌ కళ్యాణ్‌ పదేళ్ళకు పైగా రాజకీయాలలో ఎన్నో ఎదురుదెబ్బలు, సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు, అవమానాలు అన్నిటినీ ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. కనుక ఇప్పుడు రాజకీయంగా తన ఆశయాలను అమలుచేసి తన సమర్దత, చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలో వృధా చేసుకోకూడదు. కనుక అభిమానుల కోరికని మన్నించడం కష్టమే. కనుక హరిహర వీరమల్లు ఆ సినిమాలోనే కాదు… బయట కూడా ఇంకా చాలా పోరాటాలు చేయాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories