జనసేన, టిడిపిలు ఇకపై కలిసి పనిచేస్తాయని, వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. కనుక ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చేమో కానీ అభ్యంతరాలు ఉండకూడదు. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయంతో ఏకీభవించి అప్పుడే టిడిపి శ్రేణులతో కలిసి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు.
కానీ మీడియా, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇస్తున్నవారు ఇదేదో నేరం, ఘోరం, దారుణం అన్నట్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం, టిడిపిని విమర్శిస్తుండటమే విచిత్రంగా అనిపిస్తుంది. టిడిపితో కలిసి జనసేన ఎన్నికలలో పోటీ చేస్తే వైసీపి నష్టపోతుంది కనుక ఆ పార్టీ నేతలు ఆందోళనతో ఏదో మాట్లాడటం సహజమే. కానీ పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఉన్న మీడియా, సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం, టిడిపిని ఆడిపోసుకొంటుండటమే విస్మయం కలిగిస్తుంది.
గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఏపీలో జనసేన బలపడింది. ప్రజాధరణ కూడా పెరిగిన మాట వాస్తవం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మరింత రాజకీయపరిణతి సాధించిన్నట్లు స్పష్టంగా కనబడుతున్నారు. ఈసారి మంగళగిరిలో వివిద వర్గాల నేతలతో, కులసంఘాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమై, వారందరి మద్దతు కోరడం ఓ చక్కటి నిదర్శనం.
మొన్న రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ క్రిమినల్ థింకింగ్ చేసే వైసీపిని ఎదుర్కోవాలనే టిడిపితో కలిసి పోటీ చేయడం తప్పనిసరి అని లేకుండా నష్టపోతామని స్పష్టంగా చెప్పారు. జనసేనకు ఎక్కడెక్కడ పూర్తి బలం ఉందో, ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయో అక్కడే పోటీ చేస్తామని ఇదివరకే చెప్పారు.
పవన్ కళ్యాణ్ ఇంత రాజకీయ పరిణతితో నిర్ణయాలు తీసుకొని మాట్లాడుతుంటే, ఆయనను సమర్దించేవారు టిడిపిని ఏదో వంకతో విమర్శిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఎప్పుడూ కుట్రపూరితంగా, దౌర్జన్యంగా వ్యవహరించే వైసీపి చేతిలో అధికారం, యంత్రాంగం, ధనబలం, అంగబలం కూడా పుష్కలంగా ఉన్నాయి. కనుక అటువంటి వైసీపిని ఎదుర్కోవాలంటే కేంద్రం సహాయసహకారాలు కూడా అవసరమని చంద్రబాబు నాయుడు అంతటివారే భావిస్తుంటే, జనసేన ఒక్కటీ ఎన్నికలకు వెళ్ళినా అవలీలగా వైసీపిని ఓడించేసి అధికారం చేజిక్కించుకోగలదని పవన్ కళ్యాణ్ మద్దతు పలుకుతున్న కొందరు భావిస్తుండటం రాజకీయ అజ్ఞానమే కదా?
టిడిపి, జనసేనలు ఎన్నికల పొత్తు పెట్టుకోకూడదని గట్టిగా కోరుకొంటున్న వైసీపీ ఆలోచనలను అనుగుణంగా ఆలోచిస్తూ మాట్లాడుతున్న ఇటువంటి వారి ద్వారానే జనసేనలో కూడా వైసీపి చిచ్చు రగిలించే ప్రమాదం ఉంటుందని గ్రహిస్తే మంచిది.



