జనసేనతో కలిసి పనిచేస్తారా పురందేశ్వరిగారు?

Pawan-Kalyan-Daggubati_Purandeswariరాజకీయాలలో ఎవరి లెక్కలు వారికుటుంటాయి కనుక బిజెపితో కలిసి జనసేన ముందుకు సాగదలిస్తే దానిని తప్పుపట్టలేము. పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తమకు అభ్యంతరం లేదని సోమూ వీర్రాజు ఇదివరకే చెప్పారు. కనుక కొత్తగా అధ్యక్ష పదవి చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి కూడా దీనికి కట్టుబడే ఉండవచ్చు. ఎన్నికలకు 8-9 నెలల ముందు పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమెకు ఇంతకు మించి వేరే దారి లేదు కూడా.

ముఖ్యంగా వైసీపీతో తమకు ‘అక్రమ సంబందం’ లేదని బిజెపి, కేంద్ర ప్రభుత్వం కూడా నిరూపించుకొంటే ఆంద్రా ప్రజల నమ్మకం పొందగలుగుతుంది. కానీ ఎంపీల మద్దతు తప్ప ప్రజల నమ్మకంతో తమకు పనిలేదన్నట్లు వ్యవహరిస్తే, బిజెపితో పాటు జనసేన కూడా మునుగుతుంది.

ADVERTISEMENT

నిజానికి ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రా ప్రజల పట్ల ఏవిదంగా వ్యవహరించిందో, గత నాలుగేళ్ళుగా బిజెపి కూడా సరిగ్గా ఆలాగే వ్యవహరిస్తోంది. ఇది తెలిసి ఉన్నపటికీ పవన్‌ కళ్యాణ్‌ బిజెపితో ఎందుకు కలిసి ముందుకు సాగాలనుకొంటున్నారంటే, తాను ముఖ్యమంత్రి అవడానికి మాత్రం కాదు. వైసీపీని ఎదుర్కోవాలంటే కేంద్ర ప్రభుత్వం అండదండలు అవసరమని మాత్రమే!

అయితే బిజెపికి జనసేన మిత్రపక్షంగా సాగుతున్నప్పటికీ, వైసీపీ నేతలు పవన్‌ కళ్యాణ్‌తో ఏవిదంగా చెడుగుడు ఆడుకొంటున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. అయినా సోమూ వీర్రాజు లేదా బిజెపి నేతలు ఏనాడూ పవన్‌ కళ్యాణ్‌కు అండగా నిలబడలేదు. ఇప్పుడు దగ్గుబాటి పురందేశ్వరి బిజెపి పగ్గాలు చేపడుతున్నారు కనుక ఇకనైనా ఏపీ బిజెపి నేతలు జనసేనకు ఎంత గట్టిగా మద్దతు ఇస్తే అంతా వారికే మేలు కలుగుతుంది.

జనసేన బిజెపిపై ఒకందుకు ఆధారపడుతుంటే, బిజెపి ఏపీలో నిలదొక్కుకొనేందుకు జనసేనతో దోస్తీ చేస్తోందనేది బహిరంగ రహస్యం. కనుక వేర్వేరు కారణాలతో పరస్పరం ఆధారపడి ఉన్నప్పుడు పరస్పరం సహకరించుకోవడం కూడా అంతే అవసరం. ఇందుకు జనసేన సిద్దంగానే ఉంది. మరి బిజెపి సిద్దంగా ఉందా?దగ్గుబాటి పురందేశ్వరే చెప్పాలి!

ఆంధ్రాలో జనసేన పుంజుకొంటే దానితో కలిసి సాగుతున్నందుకు బిజెపి కూడా గౌరవప్రదమైన సీట్లు సంపాదించుకోగలుగుతుంది. అవసరమైతే తెలంగాణలో కూడా బిజెపి, జనసేనలు కలిసి ముందుకు సాగవచ్చు. అప్పుడు అక్కడ కూడా బిజెపికి పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు మద్దతు లభిస్తుంది.

ఇక జనసేన సరైన దారిలోనే ప్రయాణిస్తోందని చెప్పొచ్చు. అయితే పవన్‌ కళ్యాణ్‌ ముందు నుంచి చెపుతున్నట్లుగా వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనీయకుండా ఏవిదంగా జాగ్రత్తవహిస్తారనేది చాలా ముఖ్యం. లేకుంటే ఈ ప్రయోగాలు, శ్రమ అంతా వృధా అయిపోతాయి.

ADVERTISEMENT
Latest Stories