ఇటీవల కాలంలో ఇద్దరు ప్రముఖులు తమ తమ కుటుంబాలతో కలిసి లండన్ టూర్ కు వెళ్ళడంతో… లండన్ నగరం బాగా వార్తల్లో నిలించింది. ముందుగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన టాలీవుడ్ హీరో మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి యుకే చెక్కేయగా, ఆ తర్వాత రాజకీయ రంగానికి చెందిన వైసీపీ అధినేత జగన్ కూడా లండన్ చేరుకున్నాడు. జగన్ చేరుకున్న తర్వాత యుకే పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇది పక్కనపెడితే, ఈ సారి లండన్ వెళ్ళబోయేది, సినీ మరియు రాజకీయ రంగానికి చెందిన వ్యక్తి కావడం విశేషం.
టాలీవుడ్ అగ్ర నటుడు మరియు ‘జనసేన’ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జూలై 9వ తేదీన యుకే పయనమవనున్నారు. బ్రిటన్ రాజధాని లండన్ పర్యటనకు వెళుతున్న పవన్, అక్కడ ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేయనున్న పలు కార్యక్రమాలకు హాజరవుతారు. తొలుత యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేష్ (యుక్తా) ఆధ్వర్యంలో జరుగుతున్న “జయతే కూచిపూడి” ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు.
అనంతరం యూకే, యూరప్ లోని తన అభిమానులు ఏర్పాటు చేయనున్న ముఖాముఖి కార్యక్రమంలోనూ భాగస్వామ్యులు కానున్నారు. ‘యుక్తా’కు చెందిన గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ప్రస్తుతం సైలెంట్ తన కొత్త సినిమా కార్యక్రమాలను కానిస్తున్నాడు పవర్ స్టార్.



