టీడీపీ, జనసేన, బీజేపీ… ఈ మూడు పార్టీల రాజకీయ పొత్తు ప్రస్తుతం ఒక ‘ఉమ్మడి కుటుంబాన్ని’ తలపిస్తుంది. ఈ ఉమ్మడి కుటుంబంలో ఏపీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, పార్టీ క్షేత్ర స్థాయి బలాబలాల ప్రామాణికంగా టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తుంటే, జనసేన రెండవ కీలక భాగస్వామిగా, బీజేపీ మరో భాగస్వామిగా కొనసాగుతున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికలతో మొదలైన ఈ మూడు పార్టీల ఉమ్మడి రాజకీయం ఇప్పుడు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగమైన పంచాయతీలతో వేరుపడింది. అయితే ఈ వేరు కాపురం కేవలం పంచాయతీలకు మాత్రమే పరిమితం అంటున్న జనసేన ఆ తరువాత ఉమ్మడి కాపురంలో సఖ్యతగా పొసగగలదా? అన్న చర్చ నడుస్తుంది.
ఇప్పటికే కడప జడ్పీ పీఠం మీద అలకతో బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తానంటూ బెదిరింపులకు దిగుతూ ఉమ్మడి కుటుంబంలో చీలిక తెచ్చేలా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీ ఎన్నికల్లో బలమున్న ప్రతిచోట, ఆకాంక్ష ఉన్న ప్రతి జనసైనికుడు, వీరమహిళ పోటీలో దిగొచ్చు అని వారికి పార్టీ నాయకులు అండగా ఉండాలంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక్కటిగా ఉన్న ఉమ్మడి కుటుంబంలో ఇప్పుడు ‘వేరు పంచాయతీలు’ మొదలైనట్టు కనిపిస్తున్నాయి. అయితే జనసేన మొదలుపెట్టిన ఈ వేరు కుంపటి పంచాయితీలతో ముగుస్తోందా? నేడు జనసేన అందుకున్న ఈ వేరు కుంపటి నినాదం భవిష్యత్ లో కూటమిని రాజకీయంగా ప్రభావితం చేయనుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
పంచాయితీ ఎన్నికలు అనేవి పార్టీ గుర్తులకు అతీతంగా జరిగేవి, ఇక్కడ అధికారికంగా పార్టీ గుర్తులతో పనిలేకపోయినా అంతర్గతంగా పార్టీ గుర్తింపు మాత్రం తప్పనిసరి. పంచాయితీలలో పార్టీ బలోపేతం అంటే అది జనసేనకు క్షేత్ర స్థాయి నాయకులను తయారుచేయడమే అవుతుంది.
భవిష్యత్ లో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న జనసేన వంటి ప్రాంతీయ పార్టీకి పంచాయితీ ఎన్నికలు అత్యంత కీలకం అనే విషయాన్ని పవన్ గ్రహించారా? పంచాయితీలలో పోటీ ద్వారా పార్టీకి క్షేత్ర స్థాయి నుంచి బలమైన రాజకీయ పునాదులు వేయాలనుకుంటున్నారా? అందులో భాగంగానే ఉమ్మడి కుటుంబంలో వేరు పంచాయతీలకు పిలుపునిచ్చారా?





