‘అ… ఆ…’ సక్సెస్ సంబరాల వేడుకలో ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ పెదాలు విప్పి పలు పలుకులు పలికారు. అరుదుగా మాట్లాడే త్రివిక్రమ్ మాటలను బహుశా సక్రమంగా అర్ధం చేసుకోవడంలో పలువురు దారుణంగా విఫలమైనట్లుగా కనపడుతోంది. ముఖ్యంగా నితిన్ తో సినిమా చేయడంపై త్రివిక్రమ్ ఒక ఆసక్తికరమైన కధ చెప్పుకొచ్చారు.
‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాకు ముందే నితిన్ తో ఒక సినిమా చేయాల్సి ఉందని, అయితే నితిన్ స్పెయిన్ వెళ్ళడంతో, అతను తిరిగొచ్చే లోపునే ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి సంబంధించిన ఒప్పందాలు జరిగిపోయాయని, ఆ సినిమా పూర్తయిన తర్వాత ఒకసారి కళ్యాణ్ గారితో మాట్లాడుతున్న సమయంలో… ‘ఎప్పుడో నితిన్ తో సినిమా చేయాలని అన్నారు’ అంటూ నితిన్ సినిమా గురించి గుర్తుచేసారని… ఈ సందర్భంగా తన మాటను గుర్తు చేసినందుకు కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.
ఎలాంటి వివాదాలకు గానీ, మరో ఆలోచనలకు గానీ తావు లేకుండా సూటిగా, స్పష్టంగా చెప్పుకొచ్చిన త్రివిక్రమ్ మాటలను పలువురు… మరొక విధంగా మార్చి చెప్పుకోవడం విశేషం. ‘పవన్ కళ్యాణ్ వలనే త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ తో సినిమా చేసారని, పవనే స్వయంగా రికమండ్ చేసారని’ చెప్పుకోవడం విశేషం. అయితే త్రివిక్రమ్ చెప్పిన మాటల్లో… నితిన్ సినిమా గురించి పవన్ గుర్తు చేసారు గానీ, రికమండ్ చేయలేదు.
బహుశా పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకునే క్రమంలో పలువురు చూపిస్తున్న అత్యుత్సాహానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అభిమానాన్ని ప్రదర్శించుకోవడంలో తప్పు లేదు గానీ, ఆ క్రమంలో నితిన్ వంటి యువ హీరోలను తక్కువ చేసే విధంగా చూపించడం తగదన్న భావనలు సినీ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి. వాస్తవాలకు దూరంగా చూపించే అభిమానం… ఒక వర్గానికే పరిమితం అవుతుందన్న విషయాన్ని గ్రహించుకోవాలి.



