మూడువేల కోసం చూసుకుంటే జడ్పీటీసీ చాన్స్ మిస్!

Rs 3,000 Refund Costs YSRCP Candidate His Election Bid

ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు సైతం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయని అందరికీ తెలుసు. కనుక ఎన్నికల బరిలో దిగిన అభ్యర్ధులు పోటాపోటీగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. కనుక ఓ మూడు వేల రూపాయిలు పెద్ద మొత్తం కాదనే చెప్పాలి.

కానీ బాపట్ల జిల్లాలో పిట్లవానిపాలెంలో వైసీపీ తరపున షేక్ మౌలాలి జడ్పీటీసీ అభ్యర్ధిగా నామినేషన్స్‌ వేశారు. రెండు సెట్స్‌ నామినేషన్స్‌, వాటికి డిపాజిట్‌గా ఆరు వేలరూపాయలు చెల్లించారు. నామినేషన్స్‌ పరిశీలన తర్వాత ఆయన బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ADVERTISEMENT

అయితే ఒక సెట్ నామినేషన్ వేస్తే చాలని ఎవరో చెప్పడంతో ఆయన మూడు వేలు వెనక్కు తీసుకోవడం కోసం ఒక సెట్ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. సంబంధిత పత్రాలపై సంతకాలు చేయడంతో ఆయనకు ఎన్నికల అధికారులు రూ.3,000 నగదు వెనక్కు ఇచ్చేశారు.

కానీ నిబంధనల ప్రకారం ఒక్క సెట్ నామినేషన్ ఉపసంహరించుకున్నా ఎన్నికలలో పోటీ నుంచి తప్పుకున్నట్లే అవుతుంది. కనుక టీడీపి అభ్యర్ధి రహ్మాన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

వైసీపీ అభ్యర్ధి షేక్ మౌలాలీ ఈ విషయం తెలుసుకొని మళ్ళీ పరుగున ఎన్నికల అధికారుల వద్దకు వెళ్ళి తాను పోటీ నుంచి తప్పుకోలేదని కేవలం అదనంగా చెల్లించిన మూడు వేలు వాపసు తీసుకునేందుకే ఒక సెట్ నామినేషన్ ఉపసంహరించుకున్నానని మొర పెట్టుకున్నారు.

కానీ అప్పటికే అదృష్టం గడప దాటి టీడీపి అభ్యర్ధి రహ్మాన్ ఇంటికి వెళ్ళిపోయింది. కనుక జగన్‌ చెప్పినట్లు మరో మూడేళ్ళు కళ్ళు మూసుకొని కూర్చోక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories