ఇన్నాళ్ళు ‘మిస్టరీ’గా ఉన్న పవన్ – రేణుదేశాయ్ ల విడాకులలో చిక్కుముళ్ళు విడిపోతున్నాయి. ఒక్కో ముడి విప్పుతూ హింట్స్ ఇస్తోన్న రేణు, ‘ఇందులో ఎవరి తప్పు ఉందో విజ్ఞానం ఉన్న వారికి అర్ధమవుతుందని’ చెప్పడంతో, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది. నిజానికి ఇన్నాళ్ళు తాను ఓపిక పట్టగా, ఫ్యాన్స్ వలనే ఈ రోజు ఈ విషయాన్ని బయటకు చెప్పాల్సి వచ్చిందని, పవన్ ఫ్యాన్స్ తీరును ఏకరువు పెట్టారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ప్రారంభమవుతోంది కనుక పవన్ ఫ్యాన్స్ సత్ప్రవర్తనతో ఉండాలని సూచించడం అనేది ఎందుకు సంకేతాలో అర్ధం చేసుకోవచ్చు. నిజమే… నేటి వర్తమాన రాజకీయాలలో వ్యక్తిగత జీవితం కూడా ముడిపడి ఉంది. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రత్యర్ధులు విరుచుకుపడే విధంగా విమర్శలతో దాడి చేస్తుంటారు. గతంలో కూడా పవన్ వ్యక్తిగత జీవితంపై, మూడు వివాహలపై చాలా విమర్శలు వెలువడ్డాయి.
కానీ తెరిచిన పుస్తకంలో ఉండే పవర్ స్టార్ లైఫ్ లో రేణుదేశాయ్ విడాకుల అంశం ఒక్కటే మిస్టరీగా మారింది. ఇప్పుడు అందులో కీలకపాత్ర పవన్ దేనని రేణు చెప్పడంతో, అందరి చూపులు పవన్ కళ్యాణ్ పై పడ్డాయి. రేణు చేసిన కామెంట్స్ కు పవన్ ఎలా స్పందిస్తారు? తన వైపు నుండి ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారు? రాజకీయంగా దీనిని ఎలా ఎదుర్కొంటారు? అలాగే ఫ్యాన్స్ కు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? అనేవి ఆసక్తికరమైన అంశాలు.



