మెగాస్టార్ చిరంజీవి… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ ఇద్దరి మెగా సోదరుల మధ్య సినీ, రాజకీయ అభిప్రాయ బేధాలు ఉన్నాయేమో గానీ, వారి మధ్య గల అనుబంధంలో ఏ మాత్రం తేడా లేదని తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చెప్తున్నాయి. ‘యునైటెడ్ కింగ్ డం తెలుగు సంఘం’ నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఎన్నారై సభ్యులు ఇచ్చిన విందు కార్యక్రమంలో… తన అన్నయ్య చిరంజీవి గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు.
‘ఒక సాధారణ మధ్య తరగతి కంటే దిగువ స్థాయి కుటుంబం తమదని, అలాంటి తనకు పట్నం వచ్చి ధియేటర్లో సినిమా చూడడమే ఎక్కువగా ఉండేదని, అలాంటి తానూ ఎప్పుడూ సినీ హీరో అవ్వాలని తాను భావించలేదని, కానీ, తన అన్నయ్య చిరంజీవి అలా కాదని, తను హీరో అవ్వాలనే తాపత్రయంతో కష్టపడ్డారని, ఆ జర్నీలో ఎన్నో దెబ్బలు తగిలాయని, అలాగే ఎన్నో అవమానాలు చవిచూసారని’ అన్న కష్టాల గురించి తమ్ముడు వినయ పూర్వకంగా చెప్పిన మాటలను ఎన్నారైలు శ్రద్ధగా ఆలకించారు.
‘అన్నయ్య చిరంజీవి తమకు వారసత్వంగా ఇచ్చింది కష్టం మాత్రమేనని, దానినే నమ్ముకోమన్నారు’ అని చెప్పగానే అక్కడున్న వారంతా చప్పట్లతో పవన్ వ్యాఖ్యల పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు. అయితే పవన్ చెప్పినట్లు సినీ రంగంలో మెగాస్టార్ కష్టపడిన తీరు అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవిల పేర్లు ఎప్పుడూ “స్వయంకృషి”కి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచిపోతాయని చెప్పడంలో సందేహం లేదు.



