అభిమానులెప్పుడూ తమ హీరోలను దైవంగానే భావిస్తారు. దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులేమి భిన్నం కాదు. ‘గోపాల గోపాల’ సినిమాలో మోడ్రన్ దేవుడుగా నటించి అభిమానుల కోరికలు తీర్చిన పవన్ కళ్యాణ్, మరోసారి ‘దేవుడు’ రూపాన్ని సంతరించుకోబోతున్నాడని సినీ వర్గాల టాక్. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా, తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు పవర్ స్టార్.
మాటల మాంత్రికుడుతో సినిమా అంటే పవన్ ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్తే. ‘జల్సా, అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్లు వీరి ఖాతాలో ఉండడంతో మళ్ళీ ఈ కాంభినేషన్ కోసం అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పవన్ ఓ కధకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఈ సినిమాను కూడా చినబాబు (అ…ఆ…ఫేం) నిర్మించనున్నారని టాక్.
ఈ సినిమాకు “దేవుడే దిగివచ్చినా” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే టైటిల్ ఖరారైతే పవన్ అభిమానులకు ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. ప్రస్తుతం హల్చల్ చేస్తున్న ఈ వార్త నిజం కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుత షెడ్యూల్స్ ప్రకారం ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లబోయే ఈ సినిమాను 2017 సమ్మర్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారట.



