‘బ్లాక్ బస్టర్’ ప్రొడ్యూసర్ పై కేసు నమోదు!

police case filed on bandla ganeshటాలీవుడ్ ‘బ్లాక్ బస్టర్’ ప్రొడ్యూసర్ గా పిలవబడే బండ్ల గణేష్ మరియు అతని సోదరుడు శివబాబులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఏసీపీ సురేందర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన డాక్టర్ దిలీప్ చంద్రకు ఫరూఖ్ నగర్ మండలం, బూర్గుల శివారులో పౌల్ట్రీ ఫామ్ లు, భూములు ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు బండ్ల గణేష్ గతంలో ఒప్పందం చేసుకున్నారు.

ADVERTISEMENT

ఒప్పందం ప్రకారం ఈ ఆస్తులపై ఉన్న బ్యాంకు రుణాలను చెల్లించి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే నిర్ణీత సమయంలోగా రుణాలను చెల్లించకపోవడంతో… ఈ ఆస్తులను, దిలీప్ చంద్ర ఇంటిని బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఈ ఆస్తులను వారి ద్వారానే విక్రయించారు. అయితే, తనకు రావాల్సిన డబ్బుల కోసం దిలీప్ చంద్ర, ఆయన భార్య, కౌన్సిలర్ కృష్ణవేణితో కలసి బూర్గుల శివారులో గల గణేష్ పౌల్ట్రీ ఫామ్ కార్యాలయానికి వెళ్లారు.

ఈ సందర్భంగా తమను గణేష్, అతని సోదరుడు శివబాబు కులం పేరుతో దూషించారంటూ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బండ్ల గణేష్ సోదరులపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల కాలంలో ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటున్నారు బండ్ల గణేష్. నంది అవార్డులు ప్రకటించిన సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ పై, బాలకృష్ణపై బండ్ల నోరు పారేసుకున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories