తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీ-టిడిపి నేత రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని రేవంత్ నోటికొచ్చినట్టు దుర్భాషలాడాడని.., ‘గాడిద కొడుకు’ అన్నాడని టీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి హైదరాబాదు జూబ్సీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు, రేవంత్ మాట్లాడిన టేపులను పరిశీలిస్తున్నామని తెలిపారు.
న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న అనంతరం కేసుపై ఎలా ముందడుగు వేయాలన్నది నిర్ణయిస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, మల్లన్న సాగర్ నిర్వాసితులకు సంఘీభావంగా మాట్లాడిన రేవంత్, సిఎం కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. గతంలో తెలంగాణకు అడ్డుపడిన వారితో కేసీఆర్ దగ్గరి సంబంధాలను కలిగి వున్నారని, తెలంగాణ నీటి ప్రాజెక్టులకు ఆంధ్రావాళ్లు అడ్డుపడుతున్నారని విమర్శిస్తున్న కేసీఆర్, అమరావతికి వెళ్లి బిర్యానీ ఎందుకు తిని వచ్చాడని ప్రశ్నించారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో నిరాశ్రయులు అయ్యే ప్రజలకు సంఘీభావంగా దీక్ష చేపట్టగా, యాగం తలపెట్టిన సమయంలో చంద్రబాబు నాయుడు, వెంకయ్య, రామోజీరావు, రాధాకృష్ణ, కేవీపీ రామచంద్రరావు వంటి వాళ్లను ఎందరినో స్వయంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారని ఆరోపించిన రేవంత్, వీరంతా తెలంగాణకు అడ్డుపడిన వారేనని కేసీఆర్ అన్నారని, మరి వీరిని ఎలా పిలిచారని కూడా కేసీఆర్ పై ధ్వజమెత్తారు.



