brs-tdp-congress-party

ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతుండటంతో ఆ పార్టీ ఖాళీ అయిపోతోంది కనుక. అయినా ఏం ప్రమాదం లేదంటున్నారు బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు.

Also Read – బాలినేని ఈ సారి ‘రాజీ’ పడలేదు..!

ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు ఇతర పార్టీలలోకి వెళ్ళిపోతున్నప్పుడు సాధారణంగా అందరూ చెప్పే మాటే ఇది. అయితే రాజకీయ పార్టీలు ఎంపీలు, ఎమ్మెల్యేలతోనే నడుస్తాయా లేక క్యాడర్‌తోనా?అంటే క్యాడర్‌తోనే అని చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి నిరూపించి చూపారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌, టిడిపిలని కేసీఆర్‌ నిర్వీర్యం చేశారు. అయినా కాంగ్రెస్‌ క్యాడర్ బలంగా ఉండటం, రేవంత్‌ రెడ్డి వంటి బలమైన నాయకుడు దొరకడంతో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగలిగింది.

Also Read – బాలినేని చెప్పబోయే ఆ గండికోట రహస్యాలు ఏమిటో?

అలాగే తెలంగాణలో టిడిపి కనుమరుగు అయిపోయిందని కేసీఆర్‌ చంకలు గుద్దుకుంటే, ఆ కనపడని టిడిపియే ఆయన ఓటమికి కారణం అయ్యింది.

గత ఎన్నికలలో ఏపీలో టిడిపికి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. పైగా జగన్‌ పాలనలో వేధింపులు అంతా ఇంత కాదు. కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వంపై పూర్తి నమ్మకం కలిగిన బలమైన క్యాడర్ ఉంది. వారికి అండగా పార్టీ నిలబడింది.

Also Read – ఐదేళ్ళ వైఫల్యం 100 రోజుల సమర్ధతని ప్రశ్నిస్తోంది!

కనుకనే 5 ఏళ్ళ జగన్‌ పాలనలో వేధింపులను, కేసులను భరిస్తూ, కార్యకర్తలు నిబ్బరం కోల్పోకుండా పోరాడుతూనే ఉన్నారు. చివరికి వైసీపిని ఓడించారు కూడా.

కార్యకర్తల కోసం నారా లోకేష్‌ పార్టీలో ప్రత్యేకంగా ఓ వ్యవస్థనే ఏర్పాటు చేసి వారి పిల్లల చదువులు, వైద్య సేవలు, జీవితభీమా వంటివి ఏర్పాటు చేసి క్యాడర్‌ని కాపాడుకున్నారు.

పదేళ్ళు తెలంగాణని పాలించిన కేసీఆర్‌ కూడా సుమారు 50-60 లక్షల మందితో పార్టీని నిర్మించుకున్నప్పటికీ, వారిని పట్టించుకోకుండా తన రాజకీయ వ్యూహాలు, తెలంగాణ సెంటిమెంటుతో అవలీలగా నెగ్గవచ్చనే భ్రమలో గుడ్డిగా ముందుకు వెళ్ళి ఓడిపోయారు. ఏపీలో జగన్‌ కూడా అదే తప్పు చేసి ఓడిపోయారు.

ఈరోజు హరీష్ రావు హైదరాబాద్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతూ, “ఇంతకాలం కార్యకర్తల పట్ల మేము అశ్రద్ద వహించాము. ఇకపై కార్యకర్తలు బాగోగులు చూసుకుంటూ వారికి అండగా నిలబడతాము. మీరుంటే ఎంత మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా పార్టీకి నష్టం లేదు. గతంలో కూడా మన పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ లాగేసుకుంది. అయినా మనం పదేళ్ళు అధికారంలో ఉన్నాము. అలాగే మళ్ళీ మనమే అధికారంలో వస్తాము,” అని హరీష్ రావు అన్నారు.

అంటే కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ పార్టీ క్యాడర్‌ విలువని చాలా ఆలస్యంగా గ్రహించారని చెప్పవచ్చు. కానీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోకపోయి ఉంటే, జగన్‌కు మరో 30 మంది ఎమ్మెల్యేలు లభించి ఉంటే క్యాడర్‌ని పట్టించుకునేవారా?అంటే కాదనే చెప్పవచ్చు.

అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వని జగన్, కేసీఆర్‌, ఇప్పుడు తమకు బాసటగా ఎమ్మెల్యేలు లేకపోవడం వల్లనే కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారని చెప్పవచ్చు. కానీ కాంగ్రెస్‌, టిడిపిలు మొదటి నుంచి పార్టీ క్యాడర్ బలంతోనే రాజకీయాలలో నిలద్రొక్కుకున్నాయి.

చివరిగా ఒక్క మాట: త్వరలో బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుందని, హరీష్ రావు బీజేపీలో చేరిపోతున్నారని ప్రతీరోజు మీడియాలో వార్తలు వస్తుంటే, మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు తాను అండగా నిలబడతానని హరీష్ రావు చెపుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా!