జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న ‘బిగ్ బాస్’ షో కోసం యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకటి… తారక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం… మరొకటి… ఈ షోలో ఏయే సెలబ్రిటీలు ఎంతెంత హంగామా చేస్తారు? అనే దానిపై తెలుగు ప్రేక్షకులు కాసింత ఎక్కువగానే క్యూరియాసిటిగా ఉన్నారని చెప్పవచ్చు. బాలీవుడ్ లో ప్రారంభమైన తొలినాళ్ళల్లో ఇదో ‘అడల్ట్ షో’గా కూడా కీర్తించడంతో, తెలుగులో ఎలా ఉండబోతుందో చూడాలన్న ఆసక్తి నెలకొంది.
అయితే ఇందులో పాల్గొనే డజన్ సెలబ్రిటీలలో ఇప్పటివరకు ఎవరి పేర్లు అధికారికంగా వినిపించలేదు గానీ, ఇందులో పోసాని కృష్ణమురళీ ఒకరని మాత్రం తాజాగా స్పష్టమైన విషయం. ముక్కుసూటి మనిషిగా వ్యవహరించే వారు వివాదాలకు, సంచలన విషయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారన్న విషయం తెలిసిందే. అలాంటి వ్యవహారాలలో పోసాని ఎప్పుడూ ముందుంటారు కాబట్టి ‘బిగ్ బాస్’ షోలో పోసాని సృష్టించబోయే హంగామాకు ఏ మాత్రం లోటుండదని చెప్పవచ్చు.
తొలుత పోసాని పేరు ఖరారు కాగా, ఈ జాబితాలో ఉన్న ఇతర సెలబ్రిటీల వివరాలు కూడా తెలుసుకోవాలని ప్రేక్షకులు నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఒక్కసారి అంతా ఫైనల్ అయిన తర్వాత, షోను ప్రసారం చేసే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అధికారికంగా ప్రకటించవచ్చని తెలుస్తోంది. అయితే పోసాని వంటి పెద్ద వాళ్ళతో పాటు కుర్రకారు హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మలు కూడా ఈ షోలో భాగస్వామ్యులు అయ్యేలా చూస్తున్నారని సమాచారం.



