సూపర్ స్టార్ వెండితెర రూపం కోసం అభిమానులు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. ఈ జాబితాలో సాధారణ అభిమానులే కాదు, సినీ సెలబ్రిటీలు సైతం ‘కబాలి’ ల్యాండింగ్ కోసం ఆసక్తిగా ఉన్నారన్న విషయాన్ని ‘బాహుబలి’ ప్రభాస్ స్పష్టం చేసాడు. ‘తలైవర్స్’ కబాలి కోసం ఎదురు చూస్తున్నానని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్తూ ఫేస్ బుక్ ద్వారా యంగ్ రెబల్ స్టార్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
ఇలా బయటకు వ్యక్తపరిచిన ‘బాహుబలి’ మాత్రమే కాదు, బహిరంగంగా వెల్లడించలేని ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సూపర్ స్టార్ ఎంట్రీ కోసం వేచిచూస్తున్నారు. ఇక, యంగ్ రెబల్ స్టార్ విషయానికి వస్తే, గతంలో ‘బుజ్జిగాడు’ సినిమాలో రజనీ అభిమానిగా ప్రభాస్ కనపరిచిన నటన మాస్ ప్రేక్షకులకు కట్టిపడేసింది. ‘తలైవర్’ పాటతో రజనీపై ఉన్న అభిమానాన్ని వెండితెర రూపంగా చాటుకున్నాడు ప్రభాస్.
ప్రీ రిలీజ్ లో ఉన్న ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి పలు రికార్డులను ఇప్పటికే ‘కబాలి’ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. మరి ఇదే ఊపును విడుదలైన తర్వాత కూడా కనపరిచి, గత రికార్డులను ‘కబాలి’ తిరగరాస్తాడో లేదో చూడాలి. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి’ నిలిచిన విషయం తెలిసిందే. ఈ రికార్డును తాజాగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న ‘సుల్తాన్’ కూడా అందుకునే అవకాశం లేదని ఇప్పటికే తేలిపోయింది. దీంతో ‘కబాలి’ ద్వారా సూపర్ స్టార్ ఆ రికార్డులను పటాపంచలు చేస్తాడేమోనన్న ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో నెలకొంది.




