నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో, “ప్రధాని మోడీ భుజం మీద చెయ్యేసి ప్రేమగా పలకరిస్తే పవన్ కళ్యాణ్ పొంగిపోతున్నారు. కానీ బీజేపి వాళ్ళు తమ ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బ తీయడానికే పవన్ కళ్యాణ్‌ని వాడుకుంటున్నారు తప్ప ఆయనపై ప్రేమాభిమానలతో భుజంపై చేయి వేయడం లేదు.
ఆయన భుజం మీద తుపాకీ పెట్టి బీజేపి తన ప్రత్యర్ధులని గురి చూసి కొడుతుంటే, అవతలి వారు కొట్టే దెబ్బలు పవన్ కళ్యాణ్‌కే తగులుతాయి తప్ప ఆయన వెనుకున్న బీజేపికి తగలవనే సంగతి గ్రహించాలి.
ఈ బీజేపి, ఆర్‌ఎస్ఎస్ ఎలాంటివంటే.. అవసరమున్నంతవరకు ఎవరైనైనా పైకెత్తేసి వాడుకుంటాయి. అవసరం తీరిపోగానే పక్కన పడేసి ముందుకు సాగిపోతాయి.
పవన్ కళ్యాణ్ ఈ విషయం గమనించకుండా తన రాజకీయ పరపతి చాలా పెరిగిపోయిందని భ్రమిస్తూ, మహారాష్ట్ర, తమిళనాడు రాజకీయాలు చేసేందుకు బయలుదేరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా ఆయన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన ఉప ముఖ్యమంత్రి, మంత్రి అయ్యారు. కనుక ముందు మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏపీలో చక్కగా పనిచేసుకొని మంచిపేరు సంపాదించుకుంటే ఆయనకే మంచిదికదా?
బీజేపి కోసం విలువైన మీ సమయం ఎందుకు వృధా చేసుకుంటారు? బీజేపి కోసం మీ రాజకీయ భవిష్యత్‌ని పాడు చేసుకోవడం దేనికి?” అని ప్రకాష్ రాజ్ అన్నారు.
ప్రకాష్ రాజ్ బీజేపి, ఆర్‌ఎస్ఎస్‌ని, వాటితో పాటు ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కనుక వాటి పట్ల ఆయన అభిప్రాయాలు అందుకు భిన్నంగా ఉండవు.
కానీ పవన్ కళ్యాణ్‌తో ఆయనకు ఎటువంటి విభేధాలు లేవు. పైగా ఇద్దరూ సినీ పరిశ్రమలో ఉన్నవారే. కానీ పవన్ కళ్యాణ్ బీజేపి ప్రభావంలో పడి, తనకు లభించిన ఓ గొప్ప అవకాశాన్ని పాడు చేసుకుంటున్నారనే ఆవేదన ప్రకాష్ రాజ్ మాటల్లో వినిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతగా శ్రమించారో, ఎన్ని ఆర్ధిక సమస్యలు ఎదుర్కొన్నారో ఎంతగా అవమానాలు, అవహేళనాలు భరించారో అందరికీ తెలుసు.
చిరంజీవి ప్రజారాజ్య ప్రయోగం బెడిసి కొట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేనతో రాజకీయాలలో ప్రవేశించడం వలన ఆయన ప్రయాణం ఇంకా కష్టంగా మారింది. ఒకానొక సమయంలో అభిమానులే ఆయనకు అండగా నిలబడ్డారు. ఆ ధైర్యంతోనే పవన్ కళ్యాణ్ నిబ్బరంగా ముందుకు సాగుతూ అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్ అనేక సమస్యలు, అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు వచ్చి అండగా నిలబడనివారు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఒకరొకరుగా చుట్టూ చేరారు.
పవన్ కళ్యాణ్ తాను అనుభవించిన వేదన, చేసిన ఒంటరి పోరాటాలు ఎన్నడూ మరిచిపోలేరు. కనుక ఈ గొప్ప అవకాశాన్ని ఆయన నూటికి నూరుశాతం సద్వినియోగం చేసుకోగలిగితే, ఇక ఆయనకు, జనసేన పార్టీకి తిరుగు ఉండదు.






