సంక్రాంతి పండగ ముగిసింది. మరి టాలీవుడ్ సినిమాల కలెక్షన్ల సంగతేంటి? ఈ ఏడాది పండగ మాత్రం అన్ని సినిమాలకు కాసుల పంట బాగానే పండించిందని ట్రేడ్ టాక్. అయితే ఫస్ట్ వీక్ పరవాలేదనిపించిన ఈ సినిమాలు రెండోవారం పరిస్థితి ఏంటి? మునుపటి మాదిరిగానే వసూళ్లు రాబట్టాయా? లేక ఆ జోరు తగ్గిందా? అంటే, రెండు తెలుగు రాష్ర్టాల్లో కాస్త వసూళ్ల జోరు తగ్గినట్టేనని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. పండగ సెలవులు ముగియడమే దీనికి కారణంగా చెబుతున్నారు.
ఇక, ఓవర్సీస్ విషయానికి వస్తే, నాలుగు రోజులుగా అమెరికాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు తుఫాన్ వలన అక్కడి కలెక్షన్స్‌కు గండిపడింది. అన్నింటికంటే ఎక్కువగా నష్టపోయింది ‘నాన్నకు ప్రేమతో’ సినిమానే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా మొదటి వారంలో మిగిలిన చిత్రాల కంటే ముందు వరుసలో నిలిచింది. తర్వాత స్థానాల్లో సోగ్గాడే చిన్నినాయనా, డిక్టేటర్ తర్వాత ఎక్స్‌ప్రెస్ రాజాలు నిలిచాయి.
ఇక, ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ‘సోగ్గాడు’ కింగ్ నాగార్జున తన కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను “సోగ్గాడే చిన్నినాయనా” సినిమా ద్వారా అందుకున్నాడు. మొదటి వారం దాదాపు 20 కోట్ల వరకు రాబట్టినట్టు ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. ఇక ‘డిక్టేటర్’ ఎ సెంటర్స్ లో జోరు తగ్గినా, బీ,సీ సెంటర్స్‌లో మాత్రం అదే జోరు కొనసాగించడంతో దాదాపు ఓ మోస్తరు కలెక్షన్స్ ను సాధించిందని టాక్.
శర్వానంద్ “ఎక్స్‌ప్రెస్ రాజా” కూడా ఈ సంక్రాంతిని బాగానే వినియోగించుకుందని తెలుస్తోంది. సంక్రాంతి దాటిన తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలేవీ రాకపోవడంతో ఈ నాలుగు సినిమాల హవా కంటిన్యూ అవుతోంది. దీంతో ఈ వారం ముగిసే సమయానికి ఈ నాలుగు సినిమాలు సేఫ్‌జోన్‌కి వస్తాయని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు.





