తెలుగు సినిమా ఎన్నో డిజాస్టర్లు చూసింది కానీ కొన్ని మాత్రం కొన్నేళ్ల పాటు పీడకలలా మిగిలిపోతాయి. ఏజెంట్ గురించి అభిమానులు ఫీలవుతున్నది ఇదే. అందరూ దుమ్మెత్తిపోస్తున్నది దర్శకుడు సురేందర్ రెడ్డినే. ఫ్యాన్స్ మానసిక క్షోభ ఆ రేంజ్ లో ఉంది మరి. నిర్మాత కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాడు. హీరో తన డైరెక్టర్ చెప్పినట్టు చేస్తాడు. టీమ్ నుంచి పనితనం రాబట్టుకోవడం కెప్టెన్ అఫ్ ది షిప్ మీదే ఆధారపడి ఉంటుంది. బాహుబలి అనగానే రాజమౌళి పేరు గుర్తొచ్చినంత వేగంగా శోభు యార్లగడ్డ ఫ్లాష్ కారు. నార్త్ వాళ్ళకు పుష్ప అంటే బన్నీ సుకుమార్ లే. మైత్రి నవీన్, రవిశంకర్ లు కాదు.
సో ఇక్కడ బాధ్యతగా వ్యవహరించాల్సింది ముమ్మాటికీ దర్శకుడే. ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర ఎలాంటి భేషజాలకు పోకుండా పరాజయాన్ని ఒప్పేసుకున్నారు. అసాధ్యమనిపించిన ఎత్తును చేరుకోగలమనే నమ్మకంతో భుజాలకు ఎత్తుకున్నామని కానీ ఫెయిలయ్యామని ఓపెన్ అయ్యారు. చేతిలో బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ మొదలుపెట్టడం దగ్గరి నుంచి కరోనా లాంటి ఎన్నో కారణాల వల్ల న్యాయం చేయలేకపోయామని ట్వీట్ చేశారు. ఖరీదయిన తప్పుల నుంచి చాలా నేర్చుకున్నామని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఇంత క్లియర్ గా ఒక నిర్మాత తన ఫ్లాపుని అది నాలుగో రోజే ఒప్పేసుకోవడం అరుదు. ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే సరైన స్క్రిప్ట్ చేతిలో లేకుండా యాభై అరవై కోట్ల బడ్జెట్ తో అఖిల్ లాంటి అప్ కమింగ్ స్టార్ హీరో ఇమేజ్ ని పణంగా పెట్టి డేంజర్ గేమ్ ఆడింది ఎవరంటే వేళ్ళు అన్నీ సురేందర్ రెడ్డినే చూపిస్తాయి. సైరా నరసింహారెడ్డి తర్వాత వచ్చిన గ్యాప్ ని ఎందుకు వాడుకోలేదు. వక్కంతం వంశీ ఇచ్చిన కథ సరిగా లేనప్పప్పుడు మరింత మెరుగైన సబ్జెక్టు కోసం పని చేయాల్సింది. ఒకవేళ సంతృప్తికరంగా లేకపోతే వాయిదా వేయడమో లేదా ప్రాజెక్టు వదులుకోవడమో చేయాల్సిందని ఫ్యాన్స్ వాదన.
ఇందులో లాజిక్ ఉంది. సురేందర్ రెడ్డికి ఇదేమి డెబ్యూ కాదు. వదులుకుంటే మరో ఛాన్స్ రాదని చెప్పడానికి. చేతిలో పదిహేడేళ్ల అనుభవం, చిరు బన్నీ చరణ్ లాంటి అగ్ర హీరోలతో చేసిన రేంజ్ ఇవన్నీ అండగా ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు తొందరపడాలనే ప్రశ్న తలెత్తుంది. చిన్న పిల్లాడు సైతం నవ్వుకునే యాక్షన్ ఎపిసోడ్లు పెట్టి సీరియస్ గా సాగాల్సిన స్పై డ్రామాని కామెడీగా మార్చినప్పుడే కనీసం ఓసారైనా విశ్లేషించుకుని ఉండాల్సింది. ఈ మాత్రం దానికి అఖిల్ ని అంత కష్టపెట్టి సిక్స్ ప్యాకులు, ఎక్సర్సైజులు చేయించి ఒళ్ళు హూనం చేశారా. ఇదంతా సరే కానీ బౌండ్ స్క్రిప్ట్ లేనప్పుడు ఇంత రిస్క్ అనిల్ సుంకర ఎందుకు చేసినట్టు, అఖిల్ ఎందుకు గుడ్డిగా ఒప్పుకున్నట్టు, మమ్ముట్టి ఎందుకు వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు.



