ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా పూరీ జగన్నాధ్ లో టాలెంట్ ని మాత్రం ఎవరూ తక్కువ అంచనా వేయరు. తన సత్తా ఏమిటో మరోసారి “ఇజం” టైటిల్ ద్వారా చాటిచెప్పాడు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా, ఈ పోస్టర్ ఒకే ఒక టాక్ ‘అదిరింది’ అనిపించుకుంటోంది.
ముఖ్యంగా టైటిల్ డిజైన్ లో అన్ని ‘ఇజాలను’ చూపిస్తూ… సినిమా పేరు ‘ఇజం’ అని పెట్టి పూరీ తన మార్క్ ను చూపించాడు. అలాగే ఈ పోస్టర్స్ పై రాసిన కొటేషన్స్ కూడా పూరీ మార్క్ డైలాగ్స్ ను గుర్తుకు తెస్తున్నాయి. చూడబోతుంటే తమ్ముడుకు ‘టెంపర్’ ఇచ్చి ఎలా అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను మరో మలుపు తిప్పాడో, కళ్యాణ్ రామ్ కెరీర్ ను కూడా ఈ “ఇజం” ద్వారా మరో మలుపు తిప్పేలా కనపడుతున్నాడు పూరీ.
అయితే సినీ జనాలకు బాగా తెలిసింది ‘పవనిజం.’ గత పూరీ సినిమాలలో పవన్ అభిమానుల పైన కొన్ని సెటైరికల్ డైలాగ్స్ వేసిన పూరీ జగన్నాధ్, ఈ ‘ఇజాన్ని’ అడ్డుపెట్టుకుని కూడా మరిన్ని పంచ్ లు పేలుస్తాడా? అన్న రీతిలో సినీ జనాలు ఈ పూరీ “ఇజాన్ని” పేర్కొంటున్నారు. టైటిల్ తోనే వీక్షకులను, ట్రేడ్ వర్గాలను పడేసిన పూరీ… ఈ “ఇజం” ద్వారా ప్రేక్షకులను ఎలాంటి “ఇజం”ను పరిచయం చేస్తాడో చూడాలి.



