రెండు సార్లు వరుసగా ఘోరపరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మొదలు అయ్యాయి. ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు నాలుగు పేజీల లేఖ విడుదల చేశారు. ఇక తాను కాంగ్రెస్ అధ్యక్షుడిని కాదని, వెంటనే పార్టీ కొత్త సారథిని ఎన్నుకోవాలని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ త్వరలోనే సమావేశమైన కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని, కొత్త అధ్యక్షుడి ఎన్నికలో కూడా తాను పాల్గొనబోనని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.
మే 25న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే ఆ రాజీనామాను సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తిరస్కరించింది. అయినప్పటికీ రాహుల్ మాత్రం రాజీనామాపై వెనక్కి తగ్గడం లేదు. రాహుల్‌కు నచ్చజెప్పేందుకు పార్టీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూ వస్తున్నారు. దీనితో చాలా ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం నుండి కాకుండా బయటి వారు ప్రాతినిధ్యం వహిస్తారా అనే చర్చ జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అంటూ బీజేపీ తరచూ విమర్శలు చేస్తుంది. ఒకరకంగా పార్టీలో ఈ సంక్షోభం పార్టీకి కలిసి వచ్చేదే అని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీని కింద నుండి పై దాకా ప్రక్షాళన చేసి నూతన నాయకత్వమునకు బాధ్యత అప్పగిస్తే మంచిదే. సోనియా గాంధీ అంటే అవినీతి, రాహుల్ గాంధీ అంటే అసమర్ధత అనే ఇమేజ్ నుండి పార్టీకి బయటపడే అవకాశం వస్తుంది. మరి దీనిని ఆ పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో చూడాలి. ఓటమికి బాధ్యత తీసుకుని రాజీనామా చెయ్యడం రాహుల్ గాంధీ రాజకీయ పరిణితిని చూపిస్తుంది అని కూడా వారు అభిప్రాయపడుతున్నారు.



